
న్యూఢిల్లీ: డ్రగ్ సిండికేట్‌ను నడుపుతున్న ఓ మహిళకు సంబంధించి రూ.4 కోట్ల ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. వీటిలో రూ.2 కోట్లు బ్యాంకు డిపాజిట్లు కాగా.. రూ.2 కోట్ల విలువైన ఒక బిల్డింగ్ ఉన్నాయి. నిందితురాలిని కుసుమ్ గా గుర్తించారు. వాయువ్య ఢిల్లీలోని సుల్తాన్ పురి ఏరియాకు చెందిన కుసుమ్.. ‘డ్రగ్ క్వీన్’ గా గుర్తింపు పొందారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఆ నెలలో పోలీసులు కుసుమ్ ఇంట్లో సోదాలు చేయగా భారీ ఎత్తున డ్రగ్స్, క్యాష్ దొరికాయి. ఆ టైంలో ఇంట్లో ఉన్న కుసుమ్ కొడుకు అమిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 550 హెరాయిన్ ప్యాకెట్లు, రూ.14 లక్షల నగదు, మహింద్రా స్కార్పియో ఎస్ యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆ సోదాల్లో మొతం ఎనిమిది స్థిరాస్తులను సీజ్ చేశారు. కుసుమ్ రికార్డును చెక్ చేయగా అప్పటికే ఆమెపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్ కింద 12 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాయువ్య ఢిల్లీలో డ్రగ్ సప్లై చైన్ దందాను కుసుమ్ నడిపిందని అధికారులు తెలిపారు. నిందితురాలి కూతుళ్ల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించారు. గత 18 నెలల్లో రూ.2 కోట్లు డిపాజిట్ చేసినట్లు తేలింది. ఈ మొత్తం నగదును వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు, రూ.5 వేలు వంటి చిన్నచిన్న మొత్తాల్లో డిపాజిట్ చేశారు. ఇక సుల్తాన్ పురిలోనే కుసుమ్ కు చెందిన ఒక బిల్డింగ్ (మినీ మ్యాన్షన్) ను కూడా పోలీసులు సీజ్ చేశారు.