ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్

V6 Velugu Posted on Jan 29, 2022

దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ఘనంగా బీటింగ్ రిట్రీట్ పరేడ్ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమంతో లాంఛనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయ్యాయి. బీటింగ్ ది రిట్రీట్ పరేడ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్.. మూడు దళాల చీఫ్‌లు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఆయా దళాల సైనికులు పరేడ్‌లో చేసిన ఫుట్ మార్చ్, ఫోర్సెస్ బ్యాండ్ అందరినీ కట్టిపడేశాయి. బీటింగ్ రిట్రీట్‌లో ఆర్మ్డ్ ఫోర్సెస్‌ బ్యాండ్ మ్యూజిక్‌తో పాటు ‘యే మేరే వతన్‌ కే లోగో’ పాటను కూడా తమ బ్యాండ్‌పై మోగించాయి. 

ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో, డ్రోన్‌ ఫార్మేషన్స్‌

బీటింగ్ రిట్రీట్‌లో భాగంగా భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల చిత్రాలు, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు వాళ్లు సాగించిన పోరాటం తీరు తెన్నులను లేజర్ షో రూపంలో  ప్రదర్శించారు. దీనితో పాటు వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో జాతీయ జెండా రంగుల్లో ఇండియా మ్యాప్, 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని గుర్తు చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హిందీ అక్షరాలు, మేకిన్ ఇండియా లోగో, గాంధీజీ చిత్రం సహా స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు సన్నివేశాలను ప్రదర్శించారు.  75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ షో, లేజర్ షో ఈ ఏడాది బీటింగ్ రిట్రీట్‌ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. 

అగ్రదేశాల సరసన భారత్

ఈ ఏడాది బీటింగ్ రిట్రీట్‌లో 1000 డ్రోన్లతో ఏర్పాటు చేసి స్పెషల్ షో భారత్‌ను అగ్రదేశాల సరసన నిలిపిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి షో నిర్వహించిన దేశాలు మూడు మాత్రమేనని, యూకే, రష్యా, చైనా తర్వాత ఆ ఘనత భారత్‌కే దక్కుతుందని అన్నారు. ఈ డ్రోన్ షో నిర్వహించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫండింగ్ చేసిందని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ డ్రోన్ల తయారీ, వాటి ఫార్మేషన్స్‌పై ప్రాక్టీస్ సహా ఐఐటీ అల్యుమినీ దాదాపు 6 నెలల పాటు పని చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

కశ్మీర్‌‌లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

బీజేపీ నేత హత్య: నిందితుల్ని పట్టిస్తే రూ.2.5 లక్షల నజరానా

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!

Tagged Delhi, Republic Day, vijay chowk, beating retreat ceremony, drone show, Drone formations

Latest Videos

Subscribe Now

More News