అందుకే ఆప్ పై దాడులు చేస్తున్నరు: కేజ్రీవాల్

అందుకే ఆప్ పై దాడులు చేస్తున్నరు: కేజ్రీవాల్
  • బీజేపీకి బిగ్గెస్ట్ చాలెంజ్ ఆమ్ ఆద్మీనే
  • అందుకే ఆప్ పై దాడులు చేస్తున్నరు: కేజ్రీవాల్ 
  • ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన సీఎం 
  • మా ఎమ్మెల్యేలెవరూ పార్టీ ఫిరాయించలేదన్న ఆప్ చీఫ్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్​అరవింద్ ​కేజ్రీవాల్​ విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆప్​ప్రభుత్వంపై శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా కేజ్రీవాల్​ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిపై శనివారం సభలో ఓటింగ్​జరిగింది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్‌‌‌‌ ఎమ్మెల్యేల్లో 54 మంది ఓటింగ్‌‌‌‌కు హాజరుకావడంతో సభ మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది.

అనంతరం కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. బీజేపీకి ఆప్ అతిపెద్ద సవాలుగా మారిందని, అందుకే అన్ని వైపుల నుంచీ దాడి జరుగుతోందని ఆరోపించారు. తనను అరెస్టు చేసి, ఆప్‌‌‌‌ని అంతమొందించాలని బీజేపీ చూస్తున్నదన్నారు. ఆప్ ఎమ్మెల్యేలెవరూ పార్టీ ఫిరాయించలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బీజేపీ నేతలు కోరారని, అందుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారన్నారు. కానీ, తమ  ఎమ్మెల్యేలు అంగీకరించలేదన్నారు. ఈ ఏడాది లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా.. 2029 ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి దేశాన్ని ఆప్ విముక్తి చేస్తుందన్నారు.

కోర్టు విచారణకు హాజరు..

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన  మనీ లాండరింగ్​ కేసులో కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్​కు ఐదు సార్లు సమన్లు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ విషయంపై  ఈడీ.. కోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్ పై విచారించిన కోర్టు.. ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని కేజ్రీవాల్​కు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ వర్చువల్ గా హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.