కేజ్రీవాల్ నేషనల్ లెవెల్లో ఎదుగుతారా.!

కేజ్రీవాల్ నేషనల్ లెవెల్లో ఎదుగుతారా.!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తన రాజకీయ లక్ష్యాల విషయంలో వెనక్కి తగ్గట్లేదు. 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, వెంటనే జరిగిన 2014 పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టారు. అయితే కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, ఆయన పేరు దేశవ్యాప్తంగా తెలియడానికి అది ఉపయోగపడింది. 2013 తర్వాత, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలను తాను జాతీయ స్థాయికి ఎదగడానికి కేజ్రీవాల్ ఉపయోగించుకుంటున్నారు.

కేజ్రీవాల్ నేషనల్ లెవె​ల్లో ఎదుగుతారా!

మనదేశంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ డీఎంకే. 1967లో ఆ పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నోప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి రీజినల్ పార్టీలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి.1996–98 మధ్య అయితే ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపాయి. అలాగే చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో రీజినల్ పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ పరిస్థితి..

పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో కేజ్రీవాల్ చాలా అగ్రెసివ్​గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రాలు చాలా చిన్నవి కావడంతో ఆయన తన ప్రభావం ఎక్కువగా చూపేందుకు అవకాశం ఉంది. పంజాబ్ విషయానికే వస్తే, సర్వేలన్నీ ప్రస్తుతం అక్కడ కేజ్రీవాల్ లీడింగ్‌‌లో ఉంటాయని చెబుతున్నాయి.  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఆప్ వెనక్కి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్, గోవాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను కేజ్రీవాల్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. 

కాస్మో పాలిటన్ కల్చర్ ఉన్న రాష్ట్రం గోవా. చదువుకున్నవారు, వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలయ్యారు. గత 40 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొద్ది మంది రాజకీయ నాయకులే గోవా రాజకీయాలను డామినేట్ చేస్తున్నారు. ఇక్కడ కేజ్రీవాల్ మంత్రం ‘మార్పు’. ఇప్పటికే ఇతర పార్టీలకు చాలా చాన్స్​లు ఇచ్చారని, ఇప్పుడు తమకు ఒక చాన్స్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. సర్వేలు కూడా ఇక్కడ కేజ్రీవాల్ పార్టీ 20 శాతం ఓటింగ్‌‌ను క్రాస్ చేయొచ్చని చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్ చాలా చిన్న రాష్ట్రం. ఉత్తరప్రదేశ్​లో భాగంగా ఉన్నప్పుడు, 2002లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీలే అక్కడి రాజకీయాలను డామినేట్ చేస్తున్నాయి. కేజ్రీవాల్ ఇక్కడ కూడా మార్పు మంత్రంతోనే వెళుతున్నారు. సర్వేలు కూడా ఇక్కడ కేజ్రీవాల్ పార్టీ 20 శాతం ఓటింగ్​ను క్రాస్​ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రభావం..

ఒకవేళ కేజ్రీవాల్ పంజాబ్‌‌లో విజయం సాధిస్తే, ప్రతిపక్ష లీడర్‌‌‌‌షిప్​ను క్లెయిమ్ చేసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయడానికి, మమతా బెనర్జీలాంటి వారిని పక్కనపెట్టడానికి అది సరిపోతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. రాహుల్​గాంధీ కెప్టెన్ అమరీందర్ సింగ్‌‌ను మార్చి ఆయన స్థానంలో చన్నీని కూర్చోబెట్టినా ఫలితం లేకుండా పోతోంది. 

ఉత్తరాఖండ్ విషయానికి వస్తే, ఆ రాష్ట్రంలోకి కేజ్రీవాల్ ఎంట్రీ భవిష్యత్​లో కాంగ్రెస్, బీజేపీలను పక్కకు తప్పించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఉత్తరాఖండ్​లో కేజ్రీవాల్ మెరుగ్గా ఫలితాలు సాధిస్తే, అప్పుడు కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీల్లోని పాత లీడర్లను పక్కన పెట్టేస్తాయి. 

 ఇక గోవాలో, ఉత్తరాఖండ్ మాదిరిగానే కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొంటారు. ఇది చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ కేజ్రీవాల్ 20 శాతం ఓట్లు సాధిస్తే, అది భవిష్యత్​లో రెండు జాతీయ పార్టీలకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. దశాబ్దాలుగా  ప్రాతినిధ్యం వహిస్తున్న లీడర్లు కేజ్రీవాల్ రాకతో మారొచ్చు.

 నార్త్‌‌ జనాలకు కేజ్రీవాల్ తెలిసిన ముఖమే. ఎందుకంటే  టీవీ చానళ్లు, న్యూస్​ పేపర్లు కూడా ఈ ఏరియాలను కవర్ చేస్తుండటమే దీనికి కారణం. హిందీ మీడియా కేజ్రీవాల్‌‌కి విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. మమతా బెనర్జీ, శరద్‌‌పవార్‌‌‌‌ లాంటి లీడర్లు నార్త్​లో మీడియా అటెన్షన్ కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. కానీ కేజ్రీవాల్​కు ఈ ఇబ్బందులు లేవు.

కేజ్రీవాల్​కు కలిసివచ్చే అంశాలు 

 2013 నుంచి కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారంలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. అలాగే ఆయన సాధారణ జీవితం కూడా కలిసివస్తోంది. పెద్ద పెద్ద కాన్వాయ్​లు వాడలేదు. ప్రభుత్వ నిధులు దుబారా చేయలేదు. చార్టెడ్ ఫ్లైట్స్‌‌ లేవు. పాలనలో బంధువుల ప్రవేశం, కుల ప్రభావం లేదు. మనం చూసే చాలా మంది సీఎంల కంటే కేజ్రీవాల్ చాలా డిఫరెంట్.
 ఆయన తీసుకొచ్చిన ఎన్నో స్కీములు ఒక వర్గానికో, కులానికో, మతానికో పరిమితం కాకుండా, అందరికీ ఉపయోగపడేవే అమలు చేశారు. ఈ స్కీములు ప్రజలను కేజ్రీవాల్‌‌కు దగ్గర చేస్తున్నాయి.  కానీ, చాలా మంది ముఖ్యమంత్రులు కులాల వారీగా స్కీములను తీసుకురావడంతో ఇతర కులాల్లో అసంతృప్తి పెరుగుతోంది.

తాజాగా కేజ్రీవాల్ డిజిటల్ క్యాంపెయిన్​ను మొదలుపెట్టారు. కేజ్రీవాల్​కు ఒక్క చాన్స్ ఇవ్వాలన్న మెస్సేజ్​తో వీడియోలు తీసి తమ స్నేహితులకు పంపాలని ఢిల్లీ ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. ఉత్తరాఖండ్, పంజాబ్‌‌కు చెందిన లక్షల మంది ప్రజలు ఢిల్లీలో ఉంటున్నారు. వారందరినీ టార్గెట్ చేసి కేజ్రీవాల్ ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఏ పార్టీలకూ లేనంత మొబిలైజ్ సామర్థ్యంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్ మంచి మొమెంటం క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

నెల రోజుల క్రితం ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకైతే కేజ్రీవాల్​కు ట్రెండ్స్ అనుకూలంగా ఉన్నాయి. ఫిబ్రవరి 20 వరకు  అంటే చాలా టైం ఉంది. 200 ఏండ్ల క్రితం ఫ్రెంచ్ ఎకనమిస్ట్ ప్రుధోన్ ‘‘భవిష్యత్​ను అంచనా వేయడం చాలా రకాలుగా అసాధ్యం” అని ఒక మాట చెప్పారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. పంజాబ్లో కేజ్రీవాల్ గెలిస్తే, వచ్చే లోక్​సభ ఎన్నికల నాటికి ప్రధాని మోడీని చాలెంజ్ చేసేందుకు కేజ్రీవాల్ అపోజిషన్ ఫేస్​గా మారతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

రూల్స్​ సమయానుకూలంగా మారుతాయి

ఇండియన్ పాలిటిక్స్​లో రెండు ప్రధానమైన రూల్స్ ఉన్నాయి. ఒకప్పుడు చాలా రాష్ట్రాల్లో అధికారం కోసం జాతీయ పార్టీలే పోటీ పడుతూ వచ్చాయి. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారం సాధించడంలో సక్సెస్ అయితే అక్కడ.. కాంగ్రెస్ పార్టీ వేగంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఇక రెండో రూల్ ఏమిటంటే.. ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక రాష్ట్రం కంటే ఎక్కువ చోట్ల అధికారంలోకి రాలేదు. అయితే ఈ రూల్స్ సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రెండు రూల్స్ కొనసాగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలకు చెందిన అగ్ర నేతలైన ములాయంసింగ్ యాదవ్, కరుణానిధి, శరద్​ పవార్‌‌‌‌ తమ పార్టీలను కొత్త రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ విషయంలో ఫెయిలయ్యారు. దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన పార్టీ  2014లో పంజాబ్​లో నలుగురు ఎంపీలను గెలుచుకుంది. అలాగే 2017 ఎన్నికల తర్వాత పంజాబ్​లో అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం హోదాను సంపాదించింది. ఇది చాలా పెద్ద ఘనత. ఏ ప్రాంతీయ పార్టీ కూడా చేయలేని దానిని కేజ్రీవాల్ సాధించారు. 
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్