రెండ్రోజుల్లో బొగ్గు రాకుంటే.. చీకట్లే

రెండ్రోజుల్లో బొగ్గు రాకుంటే.. చీకట్లే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరత తీవ్రమైంది. ఢిల్లీకి పవర్ సప్లై చేసే ప్లాంట్లకు మరో రెండు రోజుల్లో బొగ్గు అందకుంటే.. రాజధాని నగరంలో చీకట్లు అలుముకునే ప్రమాదం ఉంది. దేశంలో బొగ్గుతో కరెంట్​ను ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్లు 135 ఉన్నాయి. వీటిలో సగం ప్లాంట్లలో కేవలం మూడు రోజులకు సరిపోయేటంత బొగ్గు మాత్రమే ఉందని, దేశంలో 70 శాతం కరెంట్ ఉత్పత్తి వీటి ద్వారానే జరుగుతోందని నేషనల్ గ్రిడ్ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, ఒడిశాలోని ప్లాంట్లకు కూడా బొగ్గు కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని జోక్యం చేసుకోవాలి

బొగ్గు కొరత అంశంపై జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాసినట్లు శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కోల్, గ్యాస్ పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ‘‘ఢిల్లీలో పవర్ క్రైసిస్ రాబోతోంది. పరిస్థితిని స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. సంక్షోభాన్ని నివారించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి కూడా లెటర్ రాశాం” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

ఒక్కరోజుకే బొగ్గుంది

ఢిల్లీకి పవర్ సప్లై చేసే ప్లాంట్లలో ఇంకా ఒక్కరోజుకు సరిపోయేటంత బొగ్గు మాత్రమే ఉందని ఢిల్లీ పవర్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ శనివారం వెల్లడించారు. ‘‘ఢిల్లీకి కరెంట్ అందించే ప్లాంట్లలో కనీసం నెల రోజులు కరెంట్ ఉత్పత్తి చేసేందుకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ఇప్పుడున్న బొగ్గు ఇంకా ఒక్కరోజుకే సరిపోతుంది. ఇప్పటికే అన్ని ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి 50% కెపాసిటీకి తగ్గింది” అని ఆయన తెలిపారు. వెంటనే రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేసి, బొగ్గును సప్లై చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా టైంలో ఆక్సిజన్ కొరత మాదిరిగా ఇప్పుడు బొగ్గు కొరత కూడా మానవ తప్పిదంగా కన్పిస్తోంది. దీనిపై రాజకీయాలు కొనసాగుతున్నయి. ఒక సంక్షోభాన్ని సృష్టించి, దానిని పరిష్కరించడం ద్వారా గొప్ప పని చేసినట్లు చూపాలన్న ప్రయత్నం కన్పిస్తున్నట్లుంది” అని జైన్ ఆరోపించారు. కేంద్రం ఆధ్వర్యంలోని ప్లాంట్లపై ఢిల్లీ ఆధారపడి ఉందని, బొగ్గు సప్లై కాకుంటే 2 రోజుల తర్వాత బ్లాకౌట్ తప్పదన్నారు.

ఏడురోజుల్లోనే 11%  కొరత

దేశవ్యాప్తంగా ఒక ఏడాదిలో ఏర్పడే పవర్ సప్లై షార్టేజ్ లో 11.2% కొరత ఈ నెల మొదటి ఏడు రోజుల్లోనే నమోదైందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. నేషనల్ గ్రిడ్ నమోదు చేసిన డైలీ లోడ్ డిస్పాచ్ డేటాను విశ్లేషించగా ఈ విషయం వెల్లడైందని తెలిపింది. డేటా పబ్లిక్ గా అందుబాటులోనే ఉన్నా, ఈ విశ్లేషణతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోందని పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పవర్ సప్లైలో ఇబ్బందులు కన్పిస్తున్నాయని తెలిపింది. లాక్ డౌన్​లు ముగిసి, మళ్లీ కరెంట్ వాడకం పెరగడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీంతో పవర్ షార్టేజ్ ఏర్పడుతోందని వివరించింది.

పంజాబ్​లో పవర్ కట్స్

బొగ్గు కొరత కారణంగా పంజాబ్ లో పవర్ కట్స్ అమలు చేస్తున్నారు. పవర్ ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తిని భారీగా తగ్గించారు. రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ ప్లాంట్లలో రెండు రోజులకు, రెండు గవర్నమెంట్ ప్లాంట్లలో నాలుగైదు రోజులకు సరిపోయేంత బొగ్గు మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు. బొగ్గు కొరతను దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల రొటేషన్ పద్ధతిపై కరెంట్ సప్లై కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

కరెంట్​ను పొదుపుగా వాడుకోండి

ఢిల్లీలో పవర్ క్రైసిస్ తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా కరెంట్​ను పొదుపుగా వాడుకోవాలని నార్త్ ఢిల్లీకి పవర్ సప్లై చేసే టీపీడీడీఎల్ సంస్థ వినియోగదారులకు మెసేజ్ లు పంపింది. ‘‘పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత వల్ల మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్య పవర్ సప్లైకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. దయచేసి కరెంట్​ను పొదుపుగా వాడుకోండి. అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని ఎస్ఎంఎస్​లలో పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం..

పాక్‌ సపోర్ట్‌తో అఫ్గాన్ టెర్రరిస్టులు కాశ్మీర్​లోకి చొరబడే చాన్స్

పండుగ బాదుడు.. చార్జీలు పెంచేసిన రైల్వే, ఆర్టీసీ, ట్రావెల్స్

టెన్త్ సిలబస్ ఎంత? పేపర్లు ఎన్ని.. ఇంకా క్లారిటీ ఇవ్వని సర్కార్