కేజ్రీవాల్ ఫ్లెక్సీలు తీసేసి.. మోడీ ఫ్లెక్సీలు కట్టారు : ఆప్

కేజ్రీవాల్ ఫ్లెక్సీలు తీసేసి.. మోడీ ఫ్లెక్సీలు కట్టారు : ఆప్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయం(పీఎంవో) పై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన ఆరోపణలు చేసింది.  ఢిల్లీలోని అసోలా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆదివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. శనివారం రాత్రి పీఎంవో ఆదేశాల మేరకు పోలీసులు సభా స్థలికి చేరుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు స్వాగతం పలుకుతూ సభా వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తీసి పారేశారని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్..

‘‘ అరవింద్ కేజ్రీవాల్ ఫ్లెక్సీల స్థానంలో ప్రధాని మోడీని హైలైట్ చేసే ఫ్లెక్సీలను పెట్టి వెళ్లారు. ఆప్ ప్రభుత్వ ఫ్లెక్సీలు ఒక్కటి కూడా లేకుండా చేశారు. ప్రధాని మోడీ ఫ్లెక్సీలను ముట్టుకోవద్దని సభా నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు’’ అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఈమేరకు వివరాలు, ఫొటోలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ‘‘అది ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ హాజరవ్వాల్సి ఉన్న ఈ కార్యక్రమంలో పోలీసులు హల్ చల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమంలో బలవంతంగా ప్రధాని ఫ్లెక్సీలు పెట్టడం ద్వారా ఏ రకమైన సందేశాన్ని పంపుతున్నారు ’’ అని  ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఎవ్వరం కూడా ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు.