మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు

మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది.  ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం మనీష్ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోర్టును కోరుతూ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు బెయిల్ ఇచ్చింది. ఈ మూడు రోజులు ఆయన  తన మేనకోడలు వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను 2023, ఫిబ్రవరి 26న సీబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి నుంచి  దాదాపు సంవత్సరం కాలంగా ఆయన జైలులోనే ఉన్నారు. దీంతోపాటు మనీ లాండరీంగ్  కేసులో సిసోడియాను ఈడీ కూడా అరెస్టు చేసింది.

ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తుంది ఈడీ. విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఐదుసార్లు ఈడీ నోటీసులు కూడా పంపింది. అయితే, కేజ్రీవాల్ మాత్రం ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈక్రమంలో ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫిబ్రవరి 17వ తేదీన విచారణకు హాజరుకావాలని కోర్టు.. కేజ్రీవాల్ ను ఆదేశించింది. కక్ష్య పూరితంగానే కేంద్రం ఈడీని అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్ ను వేధిస్తుందంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్ బిగ్ షాక్.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా