న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కీవర్డ్ యాడ్స్ వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక కంపెనీ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను (బ్రాండ్ పేరును) వారి ప్రత్యర్థి కంపెనీలు గూగుల్‌లో ప్రకటనల కోసం కీవర్డ్‌గా వాడుకోవడాన్ని ఢిల్లీ హైకోర్టు నిషేధించింది. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న హైకోర్టు.. గూగుల్‌కు 31 వేల డాలర్ల ఫైన్ విధించింది. హింద్‌వేర్ గూగుల్ కీవర్డ్ యాడ్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
అసలు ఏంటీ ఈ కేసు..?
తమ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ అయిన HINDWARE అనే పదాన్ని గూగుల్ తన యాడ్స్ ప్రోగ్రామ్‌లో ఇతర కంపెనీలకు కీవర్డ్‌గా విక్రయిస్తుందని హింద్‌వేర్ అనే సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గూగుల్ తన కీవర్డ్ ప్లానర్ టూల్ ద్వారా ప్రత్యర్థి బ్రాండ్ల ప్రకటనలను ప్రోత్సహిస్తూ లాభపడుతోందని సదరు కంపెనీ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు హింద్ వేర్ సంస్థకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది.
ఒక బ్రాండ్ ట్రేడ్‌మార్క్‌ను ప్రత్యర్థులకు కీవర్డ్‌గా అమ్మడం లేదా సిఫార్సు చేయడం కచ్చితంగా వాణిజ్యపరమైన దుర్వినియోగమేనని తీర్పు నిచ్చింది. గూగుల్ కీవర్డ్స్ వేలం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది కాబట్టి.. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు ఆ కంపెనీనే బాధ్యత వహించాలని పేర్కొంది. ఇకపై గూగుల్ యాడ్స్‌లో హింద్‌వేర్ పదాన్ని కీ వర్డ్‌గా వాడకుండా ఢిల్లీ హైకోర్టు శాశ్వత నిషేధం విధించింది. ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘించడంతో గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు 31 వేల డాలర్ల జరిమానా విధించింది.
గూగుల్ వాదన ఏంటంటే..?
కీవర్డ్స్ అనేవి తెర వెనుకజరిగే ప్రక్రియ అని.. ప్రకటనల టెక్స్ట్‌లో బ్రాండ్ పేరు నేరుగా కనిపించదని వాదించింది. కాబట్టి ఇది ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనగా పరిగణించలేమని పేర్కొంది. కేవలం తాము మధ్యవర్తి మాత్రమేనని గూగుల్ పేర్కొంది. ఐటీ చట్టం కింద తమకు రక్షణ ఉందని వాదించింది. తాము అన్ని స్థానిక చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై హర్షం
గూగుల్ కీవర్డ్ యాడ్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును పలువురు వ్యాపారవేత్తలు, టెక్ కంపెనీ వ్యవస్థాపకులు స్వాగతించారు. భారతీయ బ్రోకరేజ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మాట్లాడుతూ.. తమ బ్రాండ్ సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలతో బాధపడుతోందని.. ఈ తీర్పు ఇప్పుడు చట్టపరమైన పరిష్కారానికి ఒక మార్గాన్ని తెరుస్తుందని పేర్కొన్నారు.
►ALSO READ | పేరెంట్స్ అలర్ట్.. మీ పిల్లలను వీధుల్లో వదులుతున్నారా?.. ఈ వీడియో చూసైనా జాగ్రత్తపడండి
భారతీయ మ్యాచ్‌మేకింగ్ కంపెనీ Shaadi.com వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ.. మీరు బ్రాండ్‌ను సృష్టిస్తారు. వేరొకరు దానిపై బిడ్ వేస్తారు. వాళ్ల నుంచి గూగుల్ ఫీజు తీసుకుంటుందని అన్నారు. ఈ తీర్పు లక్షలాది వ్యాపారాలకు ఆన్లైన్ ప్రకటనల ఆర్థిక వ్యవస్థను మార్చగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో బ్రాండ్ల కాపీరైట్, ట్రేడ్‌మార్క్ హక్కులకు పూర్తి పరిరక్షణ లభిస్తుంది.
