ఢిల్లీ కారు ఘటనలో దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన మహిళ శవపరీక్ష (పోస్టుమార్టం) నివేదిక బయటికి వచ్చింది. మృతురాలు అంజలికి బాహ్యంగా అనేక గాయాలు ఉన్నాయని, ఆమె మెదడు కనిపించలేదని శవపరీక్షలో వెల్లడైంది. శరీరంపై గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయనే అంశాన్ని నివేదికలో వివరించారు. అంజలిని 14 కిలోమీటర్లు కారుతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల చర్మం ఒల్చినట్లు అయిందని, పక్కటెముకలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయని, పుర్రె ఛిద్రమైందని, మెదడులోని కొంత భాగం కనిపించలేదని నివేదికలో ప్రస్తావించడం విస్మయకరం. ఈ ప్రమాదంలో అంజలికి తల, వెన్నెముక, ఇతరత్రా అవయవాలపై గాయాలయ్యాయి. అంజలిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. “ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో అంజలి పనిచేసేది. డిసెంబరు 31న న్యూ ఇయర్ పార్టీకి హాజరయ్యేందుకు అమన్ విహార్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తానని కుటుంబసభ్యులకు అంజలి సమాచారం కూడా ఇచ్చింది. జనవరి 1న (ఆదివారం) తెల్లవారుజామున 3.24 గంటలకు బాలెనో కారు అంజలి నడుపుతున్న స్కూటీని ఢీకొట్టింది. అనంతరం అంజలి కాలు ఆ కారు మొదటి టైరులో ఇరుక్కుంది. దాదాపు 14 కిలోమీటర్లు అంజలిని కారు లాక్కెళ్లింది. చివరకు జోంటి గ్రామం హనుమాన్ మందిర్ సమీపంలో పోలీసులు తెల్లవారుజామున 4.11 గంటలకు అంజలి మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుపై కారును మలుపుకునే క్రమంలో.. వాహన చక్రాల్లో మహిళ ఇరుక్కుపోయిందనే విషయం తమకు అర్థమైందని నిందితులు పోలీసు విచారణలో వెల్లడించారు. దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27)లను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు.