
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Liquor Scam) ఈడీ ఆఫీసులో (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆమె వెంట భర్తతోపాటు.. ఇతర బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత లాయర్ ను కూడా అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.
ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. వెళ్తారా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ.. విచారణకు హాజరయ్యారు కవిత.
ఈడీ ఆఫీసులోకి వెళుతున్న సమయంలో.. పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేశారు. కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆఫీసులోకి వెళుతున్న సమయంలో భర్త వెన్నంటే ఉండి.. భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించారు.