
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రును సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. సమీర్ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై 3 వేల పేజీలతో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ని పరిగణలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఛార్జిషీట్ పై తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.
లిక్కర్ స్కాం కేసులో సమీర్ మహేంద్రును కీలక వ్యక్తిగా గుర్తించిన విషయం తెలిసిందే. డబ్బుల వ్యవహారం మొత్తం సమీర్ మహేద్రు చూశాడనే అభియోగాలు ఉన్నాయి. ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిడెట్ సంస్థకు సమీర్ మహేంద్రు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైతో కలిసి సమీర్ మహేంద్రు వ్యాపారం చేస్తున్నాడు. ఈ స్కామ్‌లో ఇద్దరు కలిసి 2 కోట్ల30 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులను ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డబ్బుకు సంబంధించి లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి డబ్బును ఢిల్లీ వరకు ఎలా తీసుకొచ్చారు.. అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.