
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం కలిగిన రాజధానుల్లో ఢిల్లీ 10వ స్థానంలో నిలిచింది. ఏడాదికి సగటున ఒక క్యూబిక్ మీటర్ ఎయిర్ లో 84.1 విషపూరితమైన మూలకాలతో కూడిన పీఎం2.5 కణాలు ఉన్నట్టు స్విస్ గ్రూప్ కు చెందిన ఐక్యూ ఎయిర్ వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన బీజింగ్ (37.5) కన్నా ఎక్కువ అని తెలిపింది. ఐక్యూ ఎయిర్ సంస్థ 2020లో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల జాబితాను మంగళవారం ప్రకటించింది. వరుసగా మూడోసారి కూడా మన దేశం ఈ జాబితాలోకి చేరింది. గాలిలో శ్వాసకోశాలను దెబ్బతీసే, క్యాన్సర్, కార్డియాక్ అరెస్టుకు కారణమయ్యే విషపూరితమైన కణాల ఆధారంగా ఎయిర్ క్వాలిటీని లెక్కగట్టింది. ప్రపంచంలోని 106 దేశాల్లో ఎక్కువ కలుషితమైన 50 నగరాలుంటే.. వాటిలో 35 ఇండియాలోనే ఉన్నట్టు రిపోర్ట్ లో పేర్కొంది. కిందటేడాది లాక్ డౌన్ కారణంగా గాలిలో పీఎం 2.5 లెవెల్స్ 11 శాతం పడిపోయినా.. ప్రపంచంలోనే ఎక్కువ కలుషిత దేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత ఇండియా మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశంలో గాలి కాలుష్యం ఇప్పటికీ ప్రమాదకరస్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. 2020లో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కారణంగా 54 వేల మంది చనిపోయినట్టు గ్రీన్ పీస్ సౌత్ ఈస్ట్ ఏషియా అనాలసిస్ వెల్లడించింది. లాక్ డౌన్ టైమ్ లో స్వచ్ఛమైన గాలి ఉన్నా.. చలికాలం వచ్చే సరికి గాలి కలుషితమైందని, పొరుగున ఉన్న పంజాబ్ లో పంటపొలాల్లో వ్యర్థాలను తగలబెట్టడమే దీనికి కారణమని రిపోర్ట్ పేర్కొంది.