
అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలని గొంతు చించుకున్న ఓ మహిళ నిరసన.. చివరికి ఉన్మాదానికి దారి తీసింది. తన ఆరేళ్ల కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయింది. ప్రస్తుతం ఆ పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రి వద్ద జరిగింది.
ఉన్నావ్ లో అత్యాచారానికి గురైన ఓ యువతిపై రెండు రోజుల క్రితం కొందరు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ యువతి శుక్రవారం రాత్రి మరణించింది. రేప్ చేసిన నిందితులు.. తమపై కేసు పెట్టిందనే కక్షతో ప్లాన్ చేసి దారుణంగా తగులబెట్టడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారుల్లోని ఓ మహిళ తన కోపాన్ని నియంత్రించుకోలేక తన ఆరేళ్ల కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయింది. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ పాపను అదే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. శనివారం మధ్యాహ్నాం ఈ ఘటన జరిగింది.