వేదిక కూలి మహిళ మృతి.. 17మందికి గాయాలు

వేదిక కూలి మహిళ మృతి.. 17మందికి గాయాలు

జనవరి 27న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలోని వేదిక కూలిపోవడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కూలిపోయిన ప్లాట్‌ఫారమ్ చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో తయారు చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహిళను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

గాయపడిన వారందరినీ ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, MAXలో చేర్చారు. ఫ్రాక్చర్ అయిన కొందరితో సహా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇప్పటి వరకు 17మందికి గాయాలైనట్టు తేలిందని పోలీసులు తెలిపారు. 45 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ MAX ఆసుపత్రిలో మరణించింది, ఆమెను గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.

ఆలయంలోని మహంత్ పరిషర్ వద్ద మాతా జాగరణ సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కీర్తనలు ఆలపిస్తున్నప్పుడు ఉద్వేగానికి గురైన పలువురు భక్తులు వేదికపైకి ఎక్కారు. దీంతో వేదిక కుప్పకూలింది.

ఈవెంట్‌కు అనుమతి లేదు

ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, శాంతిభద్రతలను నిర్వహించడానికి తగినంత మంది సిబ్బందిని నియమించారు. అర్ధరాత్రి 12:30 గంటలయ్యేసరికి అక్కడికి సుమారు 15 నుంచి1600 మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. నిర్వాహకులు, వీఐపీల కుటుంబాలు కూర్చోవడానికి ప్రధాన వేదిక సమీపంలో ఒక ఎత్తైన ప్లాట్‌ఫారమ్ నిర్మించారు. ప్లాట్‌ఫారమ్ చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో రూపొందించగా.. ఈ వేదికపై ఉన్న వ్యక్తుల బరువును భరించలేక ఎలివేటెడ్ ప్లాట్‌ఫారమ్ కిందికి వంగిపోయింది. దీంతో ప్లాట్‌ఫారమ్‌ కింద కూర్చున్న కొంతమందికి గాయాలయ్యాయని ఓ నివేదిక పేర్కొంది. ఈవెంట్ నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 337, 304A, 188 కింద కేసు నమోదు చేశారు.

'నిర్వహణ చాలా అవసరం': గాయకుడు బి ప్రాక్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయకుడు బి ప్రాక్.. జరిగిన ప్రాణ నష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియో సందేశంలో, ఈ తరహా ఈవెంట్‌లలో నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తన కళ్ల ముందు ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారన్న ఆయన.. ఈ ఘటన తనను చాలా బాధించని తెలిపారు. తాను కల్కాజీ మందిర్‌లో పాట పాడుతున్నప్పుడు ఇది చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని గాయకుడు వీడియో సందేశంలో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానన్నారు.