సిటీలో తగ్గుతోన్న రియల్​ ఎస్టేట్ జోరు

సిటీలో తగ్గుతోన్న రియల్​ ఎస్టేట్ జోరు

హైదరాబాద్​, వెలుగు : సిటీ  రియల్​ ఎస్టేట్ మార్కెట్లో  జోరు తగ్గుతోందా...అంటే అవుననే చెబుతోంది తాజా నైట్​ఫ్రాంక్​ రిపోర్టు. ఈ ఏడాది సెప్టెంబర్​ నెలలో అపార్ట్​మెంట్ల రిజిస్ట్రేషన్​ అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే 16 శాతం తగ్గి 4,307 యూనిట్లకు పరిమితమైనట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ అపార్ట్​మెంట్ల విలువ రూ.  2,198 కోట్లని తెలిపింది. వీటిలో 71 శాతం ఇండ్ల విస్తీర్ణం వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగులని వివరించింది. ఈ ఏడాది 9 నెలల్లో మొత్తం 50 వేల ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 25,094 కోట్లని పేర్కొంది.  అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. సెప్టెంబర్​ 2021 చివరి నాటికి రూ. 27,640 కోట్ల విలువైన 62,052 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. హైదరాబాద్​,  మేడ్చల్​–మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్​ రెసిడెన్షియల్​ మార్కెట్​గా పరిగణిస్తున్నారు. 

అమ్ముడవుతున్న రెసిడెన్షియల్​ యూనిట్లలో రూ. 25 నుంచి రూ. 50 లక్షల విలువైన ఇండ్ల వాటా 55 శాతమని నైట్​ఫ్రాంక్​ రిపోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే ఇలాంటి ఇండ్ల అమ్మకాలు 39 %  పెరిగినట్లు పేర్కొంది. రూ. 25 లక్షల లోపు ఇండ్ల అమ్మకాలు మాత్రం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 16 % తగ్గినట్లు వివరించింది. రూ. 50 లక్షలకు మించిన ఇండ్ల అమ్మకాల జోరు మాత్రం తగ్గలేదని, వీటి రిజిస్ట్రేషన్లు 28 % పెరగడం విశేషమని తెలిపింది. 

వెయ్యి అడుగుల ఫ్లాట్లే ఎక్కువ ...

సెప్టెంబర్​ 2022 లో రిజిస్టరయిన ప్రాపర్టీలలో 81 శాతం వాటా వెయ్యి అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్లదేనని ఈ రిపోర్టు పేర్కొంది. మొత్తం అమ్మకాలలో  1000–2000 చదరపు అడుగుల ఇండ్ల అమ్మకాల వాటా సెప్టెంబర్​ 2022లో 71 శాతమని తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే పెద్ద వాటాను మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లా దక్కించుకుంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 43 %  ఈ జిల్లాలోనే జరిగాయి. ఆ తర్వాత 41 % రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా రెండో ప్లేస్​లో నిలిచింది. హైదరాబాద్​ జిల్లాలో 15 % రిజిస్ట్రేషన్లు జరిగాయి.  వెయిటెడ్​ ఏవరేజ్​ ప్రాతిపదికన ధరలను చూస్తే ఏడాది కిందటితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 15% పెరుగుదల కనిపిస్తున్నట్లు పేర్కొంది. మేడ్చల్​–మల్కాజిగిరి జిల్లాలలో రేట్లు అత్యధికంగా 21 %  పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.

కరోనా మహమ్మారి టైములోనూ పటిష్టంగా కనిపించిన హైదరాబాద్​ రియల్​ ఎస్టేట్ మార్కెట్​ జోరు ఈ ఏడాది తగ్గింది. రిజిస్ట్రేషన్లు తగ్గాయి. హోమ్​లోన్లపై వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాల వల్ల షార్ట్​టర్మ్​లో రియల్​ ఎస్టేట్​ జోరు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. కానీ, లాంగ్​టర్మ్​లో గ్రోత్​కు ఢోకా ఉండదు. ఎందుకంటే హైదరాబాద్​లో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. ఎకానమీ గ్రోత్​ కూడా మెరుగ్గా ఉంటోంది. 

‑ శిశిర్​ బైజాల్​-, ఛైర్మన్​, 
నైట్​ఫ్రాంక్​ ఇండియా