కొత్త ఫీచర్లతో ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్లు

V6 Velugu Posted on Nov 14, 2021

  • రూ.75 వేల నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • ప్రభుత్వ సబ్సిడీతో సేల్స్‌‌కు బూస్ట్‌‌

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: పెట్రోల్‌‌, డీజిల్ ధరలు  పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక విధంగా మంచి విషయంలా కనిపిస్తోంది. ఫ్యూయల్ ధరలు రికార్డ్‌‌ లెవెల్స్‌‌ను తాకుతుండడంతో,   వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ వైపు షిప్ట్ అవ్వడం పెరిగింది. ఎలక్ట్రిక్‌‌ టూ వీలర్ల సేల్స్ పుంజుకుంటున్నాయి. బాగా మైలేజ్ ఇచ్చే టూ వీలర్‌‌‌‌ ఉన్నా  100 కిమీల ప్రయాణానికి రూ. 150 కి పైగా ఖర్చు అవుతోంది. అదే ఎలక్ట్రిక్ టూ వీలర్ వలన ఈ ఖర్చులో ఆరో వంతు కూడా జరగడం లేదు.  హీరో ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌, ఓలా ఎలక్ట్రిక్‌‌ మొబిలిటీ వంటి కంపెనీలు సుమారు రూ.75 వేలకే తమ టూ వీలర్లను అమ్ముతున్నాయి. పెట్రోల్‌‌ టూ వీలర్లతో పోటిగా ఎలక్ట్రిక్ టూ వీలర్లను కస్టమర్ల కోసం తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సేల్ అవుతున్న మొత్తం వెహికల్స్‌‌లో 80 శాతం  వాటా టూ వీలర్లదే ఉంటుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల సెగ్మెంట్‌‌లో భారీ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం టూ వీలర్ల సేల్స్‌‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది.  కానీ, 2040 నాటికి ఈ వాటా 74 శాతానికి పెరుగుతుందని బ్లూమ్‌‌బర్గ్‌‌ ఎన్‌‌ఈఎఫ్ అంచనావేస్తోంది. నెట్‌‌  కార్బన్ ఎమిషన్స్‌‌ను 2070 నాటికి జీరోకి తీసుకురావాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నామని తాజాగా కోప్‌‌26  క్లైమేట్ సమ్మిట్‌‌లో ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్‌‌, డీజిల్ వెహికల్స్‌‌ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌కు మారడంలో ప్రభుత్వ చర్యలు తోడ్పడతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. టూ వీలర్లు ఎలక్ట్రిక్‌‌గా మారడం తప్పదని ఓలా ఎలక్ట్రిక్  సీఎంఓ వరుణ్‌‌ దుబే అన్నారు. కన్జూమర్లు ఎలక్ట్రిక్ టూ వీలర్ల వైపు ఎందుకు మారకూడదో  కారణాలు కనిపించడం లేదని చెప్పారు. 

సమస్యలూ ఉన్నాయి..
ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్‌‌లో ఇంకా  సమస్యలు ఉన్నాయి. ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ప్రభుత్వం కిలోవాట్‌‌కు రూ. 15 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన దేశాల్లో ఇచ్చేంత స్థాయిలో ఈ సబ్సిడీ లేదని ఎనలిస్టులు అంటున్నారు. చైనా వంటి దేశాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సపరేట్‌‌గా  బైసైకిల్‌‌ లేన్స్ ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. చైనా, పశ్చిమ దేశాల్లో ఉన్నట్టు దేశంలో సరిపడినంత ఛార్జింగ్ స్టేషన్లు లేవని ఎనలిస్టులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఛార్జింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. కానీ, దేశంలో టూ వీలర్ మార్కెట్ సైజు చాలా పెద్దది. ఇలాంటి మార్కెట్‌‌ ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ వైపు మారడానికి టైమ్‌‌ పడుతుందని  నిపుణులు చెబుతున్నారు.

సేల్స్ పెరుగుతున్నాయి..
హీరో ఎలక్ట్రిక్  2020–21 ఆర్థిక సంవత్సరంలో 54 వేల యూనిట్లను సేల్ చేసింది. ఈ టైమ్‌‌‌‌లో సేల్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్లలో హీరో ఎలక్ట్రిక్ సేల్స్ వాటా మూడో వంతు ఉండడం గమనించాలి. కానీ, ఇదే టైమ్‌‌‌‌లో 1.5 కోట్ల పెట్రోల్‌‌‌‌ టూవీలర్లు సేల్ అయ్యాయి. వీటితో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు చాలా తక్కువ. సేల్స్‌‌‌‌ పెంచుకునేందుకు కంపెనీలు కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను తీసుకొస్తున్నాయి. ఫుల్‌‌‌‌ ఛార్జ్‌‌పై ట్రావెల్ చేసే దూరాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఓలా తమ స్కూటర్లలోని బ్యాటరీలను ఇండ్లలో కూడా ఛార్జ్‌‌‌‌ చేసుకునే విధంగా డెవలప్ చేస్తోంది. హీరో రిమూవబుల్ బ్యాటరీతో టూ వీలర్లను తీసుకొస్తోంది.  కొన్ని కంపెనీల  మోడల్స్‌‌‌‌ సింగిల్ ఛార్జ్‌‌‌‌పై 210 కి.మీ వరకు వెళుతున్నాయి. సిటీలోనే తిరిగితే  ఈ సింగిల్‌‌‌‌ ఛార్జింగ్ ఒక వారానికి సరిపోతుంది. ఆటమ్ వంటి కంపెనీలు ఛార్జింగ్ స్టేషన్లన్లూ ఏర్పాటు చేస్తున్నాయి . భవిష్యత్‌‌ ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌దేనని, అందుకే కంపెనీలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Tagged e scooters, business, petrol, Petrol price, Two wheelers

Latest Videos

Subscribe Now

More News