యూఏఈలో భారత కార్మికులకు మస్తు గిరాకీ

యూఏఈలో భారత కార్మికులకు మస్తు గిరాకీ
  •  ​రిక్రూట్​మెంట్​ 25 శాతం అప్​
  •  వెల్లడించిన హంటర్​ రిపోర్ట్​ 

ముంబై: విదేశాల్లో బ్లూకాలర్​జాబ్స్​కోసం చూస్తున్న వారికి ఇది స్వీట్​న్యూస్​! గత ఏడాది మే– ఈ ఏడాది ఏప్రిల్​ మధ్య కాలంలో యూఏఈకు భారతదేశం నుంచి వచ్చిన స్కిల్డ్​(నైపుణ్యం కలిగిన) బ్లూ కాలర్ కార్మికులకు డిమాండ్ 25 శాతం పెరిగింది.  శ్రమ ఎక్కువ ఉండే ఉద్యోగాలను బ్లూకాలర్ ​జాబ్స్​ అంటారు.  ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్‌‌‌‌కేర్, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌తో సహా చాలా రంగాలలో జాబ్స్​ పెరిగాయి.

బ్లూ కాలర్ వర్కర్ మార్కెట్‌‌‌‌ప్లేస్ హంటర్ రిపోర్ట్​ ప్రకారం... మనదేశం నుంచి నైపుణ్యం కలిగిన బ్లూ కాలర్ వర్కర్ల డిమాండ్ మే 2023–-ఏప్రిల్ 2024 మధ్యకాలంలో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగింది.  ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు  టెక్నీషియన్ల కోసం డిమాండ్ గత సంవత్సరంలో దాదాపు 20-–25 శాతం వృద్ధి చెందింది. నైపుణ్యం లేని కార్మికుల డిమాండ్ సుమారు 10-–15 శాతం పెరిగింది.

మే 2023–-ఏప్రిల్ 2024 వరకు హంటర్​ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో లక్ష మంది బ్లూకాలర్​ వర్కర్లు రిజిస్టర్​ చేసుకున్నారు. యునైటెడ్​ అరబ్​ఎమిరేట్స్​(యూఏఈ)లో టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, తయారీ,  లాజిస్టిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు నైపుణ్యం కలిగిన భారతీయ బ్లూ కాలర్ కార్మికులకు భారీ ఎత్తున అవకాశాలు ఇస్తున్నాయి.

భారీ ప్రాజెక్టులే కారణం...

యూఏఈ  ప్రతిష్టాత్మకమైన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం, వేగవంతమైన పట్టణీకరణ,  వివిధ రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వల్ల కార్మికులకు డిమాండ్ ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా  యూఏఈలోని నైపుణ్యం లేని కార్మికులు అక్కడి సంస్థల్లో చేరి స్కిల్స్​ నేర్చుకుంటున్నారు.

మనదేశంలోనూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూఏఈలో నైపుణ్యం కలిగిన వలస శ్రామికశక్తిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్  మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలవాసులు ఉన్నారని హంటర్​సీఈఓ శామ్యూల్ జాయ్ చెప్పారు. ఈ కార్మికులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత వారి సొంత ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేయవచ్చని అన్నారు.  ఈ నైపుణ్యం మార్పిడి రెండు దేశాలకు మేలు చేస్తుందని వివరించారు.