స్వాతంత్ర్యానికి ముందే మహిళా కోటాకు డిమాండ్!

స్వాతంత్ర్యానికి ముందే మహిళా కోటాకు డిమాండ్!

స్వాతంత్ర్యానికి ముందే ‘మహిళలకు రాజకీయాల్లో స్థానం కల్పించాలి.. ఓటు హక్కు కల్పించాలి’ అనే లక్ష్యాలతో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. 1917లో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ (WIA), 1925లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా (NCWI), 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC) ఏర్పాటయ్యాయి. మహిళల కోసం ఉద్యమాలు చేశాయి. ఈ ఉద్యమాలకు ముఖ్య కారణం.. భారత ప్రభుత్వ చట్టం–1919లో మహిళలకు ఓటు హక్కును నిరాకరించడమే. ఈ విషయాన్ని  సరోజినీ నాయుడు నేతృత్వంలోని భారతదేశ మహిళా డిప్యుటేషన్ అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి ఎడ్విన్ శామ్యూల్ మాంటేగ్‌‌కు నివేదించింది. కొందరు మహిళా నాయకులు1928లో సైమన్ కమిషన్‌‌కు రిప్రజెంటేషన్‌‌ కూడా ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ కూడా “మహిళలు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి చట్టసభల్లో నాలుగు సీట్ల రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్  కలిసి మహిళలతో సహా వయోజన ఓటు హక్కుకు మద్దతు ఇచ్చే మెమోరాండంను రూపొందించాయి. దాన్ని 1931లో బ్రిటిష్ పార్లమెంట్‌‌కు సమర్పించాయి. కానీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనను వాళ్లు వ్యతిరేకించారు.

లెజిస్లేచర్లలో 2 శాతం

లార్డ్ లోథియన్ నేతృత్వంలోని ఇండియన్ ఫ్రాంచైజీ కమిటీ–1932 నివేదికలో మొదటి పదేళ్లపాటు ప్రావిన్షియల్ లెజిస్లేచర్లలో 2 శాతం నుండి 5 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని సిఫార్సు చేసింది. అలా మహిళల కోసం ప్రత్యేక సదుపాయం కల్పించకపోతే ఎక్కువ మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ  కొంతమంది మహిళలే మొదటి శాసనసభకు ఎన్నిక అవుతారని చెప్పింది.

1935 చట్టం

ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం–1935 ప్రకారం 2.9 కోట్ల మంది పురుషులు, 60 లక్షల మంది మహిళలు ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించారు. మతపరమైన ప్రాతిపదికన మహిళలకు సీట్లు కూడా రిజర్వ్ చేయబడ్డాయి. ఈ చట్టం ప్రకారమే.. మొదటిసారి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రాల చట్ట సభల్లో 41 సీట్లు, సెంట్రల్‌‌ లెజిస్లేచర్‌‌లో కొన్ని పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించారు. కానీ.. ఇక్కడ కండిషన్ ఏంటంటే.. పెళ్లైన ఆడవాళ్లు మాత్రమే అర్హులు. మహిళలు ఏదైనా జనరల్ స్థానం నుండి కూడా పోటీ చేయవచ్చు. అయితే.. ఇది మహిళలపై గౌరవంతో ఇచ్చిన అవకాశం కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్ర్యోద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ.