వీళ్లే వాళ్లు.. వాళ్లే వీళ్లు!

వీళ్లే వాళ్లు.. వాళ్లే వీళ్లు!

ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు కొత్తగా పుట్టుకురారు. అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలో నుంచే అటూ ఇటు మారుతుంటారని ఒక రాజనీతిజ్ఞుడు అన్నాడు.  ఇది రానున్న పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలను గమనిస్తే వాస్తవంగానే తోస్తున్నది. తెలంగాణలో  రాష్ట్ర ప్రభుత్వం మారడంతో రాజకీయ పునరావాస కదలికలు మొదలయ్యాయి. పచ్చగా ఉన్నకాడ తినడం వెచ్చగా ఉన్న జాగల పడుకోవడం చందంగా రాజకీయం మారింది.  వీరి  కప్పదుంకులు,  మారిన వారి సమర్థింపులు చూస్తుంటే సామాన్య పౌరులకు కూడా హైబ్రిడ్ ​రాజకీయం అర్థమవుతున్నది.

నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్ట పోయిన బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారి  టీమ్​లుగా పనిచేసిన పార్టీలలోని  సీ టీం నాయకుడు ఏనుగు ఎక్కి  అసెంబ్లీలోకి  పోతానని ప్రగల్భాలు పలికాడు. ఆయన చివరికి ఏ  రొచ్చుగుంట అడుసు  తొక్కాడో అందరూ గమనించవలసిన ముఖ్య విషయం.  ఆ నాయకుడి మాటలను నమ్మిన విద్యార్థులు, ఉద్యోగులు  ప్రజా సమూహాలను ఆయన వంచించిన తీరు మాత్రం క్షమార్హం కానేరదు. ఇది ఇలా ఉంటే మరో జాతీయ పార్టీకి మూడు నెలలకే పార్లమెంట్ ఎన్నికల్లో  ఓడలు బండ్లు అయినట్టు  బీ టీంగా మేము మారలేదని శీర్షాసనం వేస్తోంది. అంతేగాక బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం రోల్డ్ గోల్డ్ కాదని స్వర్ణయుగం అని కీర్తిస్తూ నిసిగ్గుగా మాట్లాడడం ఆక్షేపనీయం. మరోవైపు ఒక్కొక్క నాయకుడు ఎలా ప్లేటు ఫిరాయిస్తాడో, ఇతని చిలుక పలుకులను చూస్తే ఊసరవెల్లులు సైతం సిగ్గుపడిపోతాయి. నక్కలు నవ్వుకుంటాయి. ఉరికి ఉరికి పశువులను కాస్తే పొద్దూకదు అనే విజ్ఞతతో రాజకీయ పార్టీలు ఎప్పుడు తెలుసుకుని నడుచుకుంటాయో చూడాలి మరి.

చెరువు మీద అలిగినట్టు ఉంది

పంట పొలంలో కలుపు మొక్కలను పెరికివేయాల్సిన వేళ ప్రధాన పార్టీలు కనీసం ఏమాత్రం  విలువలు లేని రాజకీయ పంట దిగుబడి ఒక్కటే పరమావధిగా భావిస్తున్నాయి. తాత్కాలిక ఉపశమన రాజకీయ వ్యవస్థలను పెంచి పోషించడం దీర్ఘకాలంలో  ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిని చేయదు.  ఫక్తు  ఎత్తుగడల వ్యూహాలతో ‘ ఓట్ల వల పన్నడం’ ఆ దిశగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్న తీరు విషాదకరం. ‘తాను మునిగిందే గంగ తాను వలచిందే రంభ’ అనే నానుడి గుర్తుకొస్తుంది.  ఏమాత్రం అధికారం నిషా, అహంకారం తగ్గని నాయకులు తమ తప్పు  ఏమీ లేదన్నట్టు ప్రజలే సరైన నిర్ణయం తీసుకోలేదనడం శోచనీయం. కేసీఆర్ అండ్ కో ఆత్మ విమర్శ,  పున: సమీక్ష చేసుకోకుండానే  ప్రజలపై అభాండాలు వేయడం వేయడాన్ని చూస్తే .. చెరువు మీద అలిగినట్టుగా ఉంది.  రాజకీయ సుస్థిరతకు అడ్డదారులు వెతుక్కోవాలి గానీ, అడ్డమైన దారులను  వెతుక్కుంటే ఏమవుతుందో బీఆర్ఎస్ దుష్టాంతమే కళ్ళముందు కనిపిస్తున్న  నిజం.

సంకరజాతి వంగడాల వలె..

నేటి రాజకీయాలను చూస్తే  నాకు1975 తర్వాత గ్రామీణ వ్యవసాయరంగంలో వచ్చిన అధునాతన మార్పులు గుర్తుకు వస్తున్నాయి.  విత్తనాలలో సంకరజాతి హైబ్రిడ్ వచ్చి చేరింది. దానికి తోడు రసాయనిక ఎరువులు, పురుగు మందుల పాత్ర కూడా  గణనీయంగా పెరిగింది. జపాన్ మాదిరి వరి నాట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి కాలంలో భూస్వాములు, ధనవంతులు తినే సాంబ వరి అన్నం పంట నాలుగున్నర నెలలకు  కోతకు వచ్చేది. అనావృష్టి కాలంలో పొట్టి మొలకలు ధాన్యం మూడు నెలలకు పండేది. అటువంటిది మన పంటల వ్యవధిని వ్యవసాయ పరిశోధన కేంద్రాలు  తక్కువ కాలంలో ఎక్కువ  దిగుబడి  ఇచ్చే సంకర జాతి వంగడాలను  వ్యవసాయ క్షేత్రాలలో  ప్రవేశపెట్టారు.

తద్వారా ఆహార రంగంలో  దేశం స్వయం సమృద్ధి సాధించవచ్చు. కానీ, దీర్ఘకాలంలో ప్రజలను, రైతులను రకరకాల రుగ్మతలకు  గురి చేసింది. వ్యవసాయ రంగం మాదిరి  రాజకీయ రంగానికి కూడా వర్తించే పరిస్థితులు వచ్చాయి. అధినాయకత్వాలు నేల విడిచి సాము చేస్తే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుందనే విషయాన్ని ప్రతి పార్టీ పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ రాజకీయ చదరంగం మాటలో ఆటలో ఫలితాలు అనుకూలంగా  వచ్చినప్పటికీ, రాను రాను వారే  కొరకరాని  కొయ్యగా మారి రాజకీయ అస్థిరతకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉంటాయి.  ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజకీయ తాత్వికుడు ఆంటోనియో గ్రాంసీ కొటేషన్​ను మిత్రుడు మెసేజ్ చేశాడు. ‘సమాజం కొద్దిమంది మీద ఆధారపడి నడవదు. లేదా అదృష్టం వల్లనో, విధి ఫలితం వల్లనో నడవదు. పౌరుల చైతన్య పూరితమైన కార్యాచరణ వల్ల నడుస్తుంది’ అని చెప్పాడు.  ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితులలో ఆ నిర్వచనం చెల్లుబాటు అవుతుంది.

ఎన్నికల బాండ్లలో.. క్విడ్​ ప్రో కో

అనేక రాజకీయ పక్షాల నుంచి  అక్రమ మార్గాలలో సంపాదించిన  తమ ఆస్తుల పరిరక్షణ ఆశించి నాయకులు ఎవరు కుర్చీ మీద ఉంటే వారి పార్టీలో చేరడం ఇటీవల సర్వ సాధారణం అయిపోయింది. దీనికి ప్రధాన కారణం 1994 సంవత్సరం నుంచి  పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయం కళ్లు చెదిరిపోయేలా క్రమక్రమంగా పెరుగుతుండటం.  సామాన్యుడు కనీసం గ్రామ పంచాయతీ స్థాయిలో వార్డ్ మెంబర్ గా పోటీ చేయడానికి  జంకుతున్నారు.  విపరీతమైన ధన ప్రభావం వలన సామాన్యులకు ఎన్నికలలో నిలబడే అవకాశం లేకుండా పోయింది.  ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ స్థానంలోకి సంపాదన ఒక్కటే పరమావధిగా వచ్చి చేరింది. మరోవైపు నీకిది నాకిదిగా క్విడ్ ప్రోకో గా అన్ని రాజకీయ పార్టీల అధికార పాలన కొనసాగుతూనే ఉంది. దీనికి మంచి ఉదాహరణ ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారాలను అధ్యయనం చేస్తే  అవగతమవుతుంది.

- జూకంటి జగన్నాథం, కవి, రచయిత