ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్​..ఉంచుడా.. కూల్చుడా!

ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్​..ఉంచుడా.. కూల్చుడా!
  •    హెరిటేజ్ భవనంలా కాపాడాలంటున్న స్వచ్ఛంద సంస్థలు
  •     కూల్చేసి కొత్తది కట్టాలంటున్న డాక్టర్లు, పూర్వ విద్యార్థులు
  •     హైకోర్టులో కేసు పెండింగ్
  •     మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేయాలి
  •     కాంగ్రెస్ సర్కార్​ను కోరుతున్న ఇంటాక్ ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు : కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూల్చివేత వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బిల్డింగ్ పడగొట్టి కొత్త హాస్పిటల్ కడ్తామని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రకటిస్తే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. హాస్పిటల్​ను కూల్చేయాలని కొందరు అంటుంటే.. పాత బిల్డింగ్​ను అలాగే ఉంచి పక్కనే కొత్తది కట్టాలని మరికొందరు అంటున్నారు. ఈ వ్యవహారం కాస్త కోర్టుకెక్కడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో గత బీఆర్ఎస్ సర్కార్ సైలెంట్​గా ఉండిపోయింది. 

తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. హెరిటేజ్ బిల్డింగ్ కూల్చకుండానే కొత్త భవనాలు కడ్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. కొత్త భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనవరి 30న ఉస్మానియా మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం, పలువురు డాక్టర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వీరికి కౌంటర్​గా.. వందేండ్ల చరిత్ర కలిగిన బిల్డింగ్​ను కూల్చొద్దంటూ మరో వర్గం పిటిషన్ వేసింది. 

ఇప్పుడున్న బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని, హాస్పిటల్​కు పనికిరాదని ఐఐటీ హైదరాబాద్, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టును అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. 

కూల్చాలని గత ప్రభుత్వ నిర్ణయం

2015, జులై 23న అప్పటి సీఎం కేసీఆర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్​)​ను సందర్శించారు. బిల్డింగ్ ఎలా ఉందో రిపోర్టు ఇవ్వాలంటూ కమిటీ వేశారు. హాస్పిటల్ పనికిరాదని ఆ ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో బిల్డింగ్ కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు చారిత్రక ఆస్తులు సంరక్షించే ఇంటాక్ సంస్థ బిల్డింగ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. హాస్పిటల్ పటిష్టంగానే ఉందని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, పలు స్వచ్ఛంద సంస్థలు కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. 2020లో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు హాస్పిటల్​లోకి రావడంతో పేషంట్లను అక్కడి నుంచి తరలించి బిల్డింగ్​ను సీజ్ చేశారు.

మూసీ నది ఒడ్డున కట్టడం

ఉస్మానియా ఆస్పత్రిని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిర్మించారు. బ్రిటీష్ అర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్చ్ సూచనలతో మూసీ నది ఒడ్డున 26.5 ఎకరాల్లో 1926లో కట్టారు. కరెంట్ లేకపోయినా.. గాలి, వెలుతురు సాయంతో వైద్యం అందించేలా నిర్మించారు. ఒకేసారి 450 మంది రోగులకు ట్రీట్​మెంట్ ఇవ్వొచ్చు. మొదటి మెడికల్ కాలేజీని అఫ్జల్​గంజ్​లో నాల్గో నిజాం నసిరుద్దౌలా కాలంలో (1842) నిర్మించారు. ఆ కాలేజీ 1908లో వచ్చిన వరదల కారణంగా దెబ్బతినడంతో ఏడో నిజాం 1926లో ఇప్పటి హెరిటేజ్ బిల్డింగ్​ను నిర్మించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్​గా మార్చారు. 

ఎన్నో ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్

ఉస్మానియా ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా పేషంట్స్ వస్తారు. మత్తు మందుపై ఇక్కడే రీసెర్చ్ చేశారు. 1889లో మొదటి క్వాలిఫైడ్ అనస్థిషియా డాక్టర్ రూపా బాయిని అందించింది కూడా ఈ హాస్పిటలే. ఇన్ పేషంట్ బ్లాక్ 2.37 ఎకరాల్లో ఉంటుంది. హాస్పిటల్​లో మొత్తం 11 బ్లాకులు ఉన్నాయి. ఇటీవలే రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్​జెండర్ క్లినిక్ కూడా ఇక్కడే ప్రారంభించారు. ఎన్నో కిడ్నీ మార్పిడి చికిత్సలు, ఆపరేషన్లు చేసిన ఘనత ఈ హాస్పిటల్ సొంతం.

కొత్త బిల్డింగ్ కట్టాలి :  ఇంటాక్

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉస్మానియా హెరిటేజ్ బిల్డింగ్​ను సంరక్షిస్తూనే.. కొత్త బిల్డింగ్ కట్టాలని ఇంటాక్ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్​ను కోరారు. తమ సంస్థ ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఇంటాక్ ఆధ్వర్యంలో ‘ఓజీహెచ్ బచావో.. వాదా నిభావో..’ పేరుతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు. ‘‘సీఎం, హెల్త్ మినిస్టర్ మాకు సమయం ఇవ్వాలి. ఉస్మానియా హాస్పిటల్​కు ఘనమైన చరిత్ర ఉంది. 400 ఏండ్ల హిస్టరీ ఉన్న చార్మినార్ చెక్కుచెదరలేదు.

వందేండ్ల కింద కట్టిన హాస్పిటల్ శిథిలావస్థకు వచ్చిందని అంటున్నరు. మెయింటెనెన్స్ లేకనే అలా అయింది. కొన్ని మరమ్మతులు చేస్తే మరో 200 ఏండ్లు ఉపయోగించుకోవచ్చు’’అని అన్నారు. ఈ మీటింగ్​లో ఇంటాక్ హైదరాబాద్ కన్వీనర్ అనురాధ రెడ్డి, సజ్జద్ సాజీద్, ఇక్బాల్ జావేద్, జశ్విన్ జైరత్, సారా మాథ్యూస్, ఆసిఫ్, హనీఫ్, రఘు, కిదాంబి పాల్గొన్నారు.

చరిత్రను చెరపొద్దు

చారిత్రక కట్టడాలు మన చరిత్ర. వాటిని కూల్చడమంటే చరిత్రను చెరిపేయడమే అవుతుంది. మా సంస్థ తరఫున మూడు సార్లు హాస్పిటల్​ను పరిశీలించాం. మెయింటెనెన్స్ లేకపోవడంతోనే బిల్డింగ్ కొద్దిగా పాడైంది. టాప్ మీద నీళ్లు నిల్వడంతో పెచ్చులు ఊడాయి. కొన్ని మరమ్మతులు చేస్తే ఇంకా చాలా కాలం పాటు సేవలు అందిస్తుంది. హాస్పిటల్ కోసం వద్దంటే వేరే దానికి ఉపయోగించాలి. కానీ.. కూల్చొద్దు. దాన్ని అలాగే ఉంచి కొత్త బిల్డింగ్​లు కట్టుకోవాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

- అనురాధ రెడ్డి, కన్వీనర్, ఇంటాక్​ హైదరాబాద్