
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు భూసేకరణకు రాష్ర్ట వాటా 50 శాతం నిధులను డిపాజిట్ చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ నిధులను విడుదల చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతూ ఎన్హెచ్ఏఐ అధికారులు 5 సార్లు రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాసినా, ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ కు లేఖ రాసినా రిప్లై రాలేదన్నారు. అయితే, రాష్ట్ర వాటాను చెల్లించడంలో ఆలస్యం చేస్తుండటంతో ప్రాజెక్టుపై డైలమా నెలకొంది. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ర్ట ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి.
స్టేట్ షేర్ జమచేస్తేనే..
ప్రాజెక్టు లో 50 శాతం భూసేకరణ వ్యయం భరిస్తామని 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినట్లు సంతోష్ కుమార్గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ భారత్ మాల ఫేజ్1లో చేర్చించిందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు రాష్ర్ట వాటా రూ.2,948 .43 కోట్లు ఎన్హెచ్ఏఐకు డిపాజిట్ చేయాలని సీఎస్ ను కోరారు. ఈ అమౌంట్ డిపాజిట్ చేస్తే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న 3డీ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తామన్నారు. 3డీ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ ప్రాజెక్టుకు సేకరించిన ల్యాండ్ అంతా కేంద్రం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
ముందు చెల్లించాలన్న రూల్ లేదు: ప్రశాంత్ రెడ్డి
ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందని, రూ.5,170 కోట్లు అవసరం అవుతుండగా, ఇందులో రాష్ర్ట వాటా(రూ.2,948.43 కోట్లు)ను ముందుగా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చెప్పారు. నేషనల్ హైవేస్ చట్టం1956 ప్రకారం, భూసేకరణ కోసం మొత్తాన్ని ముందుగా డిపాజిట్ చేసే నిబంధన ఎక్కడా లేదన్నారు. కాలా (కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్) 3జీ అవార్డు ఆమోదించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొత్తంలో 50 శాతం వాటా జమ చేస్తుందన్నారు. కేంద్ర రవాణా శాఖ ఆధీనంలో ఉన్న జాతీయ రహదారులపై చేపట్టిన ప్రాజెక్టులకు ఈ విధానాన్నే అనుసరిస్తోందని చెప్పారు. 2023–-24 బడ్జెట్‌లో ఆర్ఆర్ఆర్ భూసేకరణకు రూ.500 కోట్లు కేటాయించామని, అవార్డు పాస్ చేసే ముందు రాష్ట్ర వాటా చెల్లిస్తామన్నారు.
సదరన్ పార్ట్ పైనా ఎఫెక్ట్ .
ఆర్ఆర్ఆర్ లో రెండో దశ అయిన సదరన్ పార్ట్ చౌటుప్పల్- ఇబ్రహీంపట్నం- కందుకూరు- చేవేళ్ల-శంకర్ పల్లి- సంగారెడ్డి వరకు182 కిలోమీటర్ల మేరకు చేపడుతున్నారు. ఈ అలైన్ మెంట్ ఆమోదించాలని కోరుతూ ఎన్ హెచ్ఏఐ అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. నార్త్ పార్ట్ కు సంబంధించి రాష్ర్ట వాటా విడుదల చేయకపోవటంతో ఈ అలైన్ మెంట్ ను ఆమోదించాలా వద్దా అనే ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు.
రాష్ట్ర నిర్ణయంపైనే ప్రాజెక్ట్ ఫ్యూచర్: గడ్కరీ
ఆర్‌ఆర్‌ఆర్ పనుల కాలపరిమితి.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను డిపాజిట్ చేయడంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ స్టేటస్ పై ఇటీవల లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు గడ్కరీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ నార్త్ పార్ట్ ప్రాజెక్టును భారత్ మాల మొదటి దశలో చేర్చినట్టు తెలిపారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ పై రాష్ర్ట వాటా విడుదల ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు కాస్ట్ మరింత పెరుగుతుందని ఎన్ హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. రాష్ర్ట వాటాపై ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావుతో సైతం మాట్లాడామని, అయినా స్పందన లేదని ఓ అధికారి వెల్లడించారు.