కామారెడ్డిలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షం డెవలప్‌మెంట్‌

కామారెడ్డిలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షం డెవలప్‌మెంట్‌

పేరుతో అధికార పక్షం ప్రజలకు దగ్గరయ్యేందుకు లీడర్ల  ప్రయత్నాలు

కామారెడ్డి, వెలుగు: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందే కామారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రజా, స్థానిక సమస్యలు, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ  ప్రతిపక్ష పార్టీలు.. డెవలప్‌మెంట్‌ స్కీమ్స్‌ పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరికి వారు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి అవకాశాన్ని అటు ప్రతిపక్షం.. ఇటు అధికార పక్షం లీడర్లు వదులుకోకుండా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా గ్రామాల్లో లీడర్లు చేస్తున్న హడావుడి ఎన్నికల వాతవరణాన్ని తలపిస్తోంది. 

ప్రజా సమస్యలపై బీజేపీ ఫోకస్‌...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు దిశగా బీజేపీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. సమస్యలు తెలుసుకునేందుకు ఈ పార్టీ నేతలు గ్రామాలు, టౌన్‌లలో పర్యటిస్తున్నారు. స్థానికంగా ప్రజా సమస్యలపై ఎక్కువగా ఫోకస్​ చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయా వర్గాల పక్షాన ఇటీవల ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు చేశారు. కొద్ది రోజుల కింద ధరణితో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమరణ నిరహర దీక్ష చేపట్టారు. తాజాగా కామారెడ్డి టౌన్‌​ ప్లాన్‌ను ఇష్టారాజ్యంగా చేపట్టడంపై ఆందోళలను చేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్​, గ్రీన్​ జోన్‌తో పాటు విలీన గ్రామాల మీదుగా కొందరు లీడర్ల వెంచర్లకు అనువుగా ఉండేలా 100  ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలతో భూములు నష్టపోతున్న రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొద్ది రోజుల కింద ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 10 రోజుల పాటు  ప్రతి గ్రామంలో పర్యటించారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార  స్థానిక సమస్యలపై మండలాల్లో  ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఇన్‌చార్జి మల్యాద్రిరెడ్డి యాత్ర చేపట్టారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో స్థానిక లీడర్లు పర్యటిస్తున్నారు. 

అభివృద్ధి పేరుతో బీఆర్‌‌ఎస్‌...

అధికార బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు  కొద్ది రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఆయా పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం చెక్కు పంపిణీ తదితర ప్రోగ్రామ్‌ పేరిట హడావుడి చేస్తున్నారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తరచూగా పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో  ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్, జుక్కల్‌లో ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ రెగ్యులర్‌‌గా ఏదో ప్రోగ్రామ్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.  జుక్కల్ నియోజకవర్గంలో ఇటీవల మంత్రి హరీశ్‌రావు మూడు  మండలాల్లో పర్యటించారు.  నాగిరెడ్డిపేట మండలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత హాజరై  శ్రేణులను ఉత్సహ పరిచే ప్రయత్నం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

జోడో యాత్రతో జోష్...

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవల జిల్లా మీదుగా సాగింది. జుక్కల్ నియోజకవర్గంలో యాత్రతో పాటు  భారీ సభ నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కామారెడ్డిలో  మాజీ మంత్రి షబ్బీర్​అలీ తరచూ పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిలో  మదన్‌మోహన్‌​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పోటాపోటీగా  కార్యక్రమాలు చేపడుతున్నారు. హెల్త్ క్యాంపులు, ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో  స్థానికంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజ లకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు.