
ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్ ధర్మం న హంతవ్యమానో ధర్మో హతోవధీత్
ధర్మాన్ని హరిస్తే తిరిగి ధర్మం వారిని హరిస్తుంది. ధర్మాన్ని కాపాడితే అది వారిని కాపాడుతుంది. కనుక ధర్మాన్ని ధ్వంసం చెయ్యరాదు... అని మహాభారతం కథ మనకు తెలియచేస్తోంది.
ధర్మవిరుద్ధంగా ప్రవర్తించినవారు చివరకు ఆ కారణంగా హతులవుతారు. ఇందుకు ఉదాహరణ మహాభారతం. కౌరవులు అనుక్షణం ధర్మాన్ని అతిక్రమించారు. కర్ణుడు, శకుని వారికి తోడయ్యారు. అందరూ అధర్మయుతంగానే జీవించారు. అందుకే చివరకు వారిని ధర్మమే నాశనం చేసింది.ఈ ధర్మం గురించి అరణ్య పర్వంలో ధర్మరాజు యక్షుడితో సంభాషిస్తాడు.
ఒకనాడు జూదంలో ఓడిన పాండవులు.. ఒప్పందం ప్రకారం పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. అలా పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో.. ఒకరోజు పాండవులకు బాగా దాహం వేసింది. నీరు తీసుకునిరావడం కోసం.. అన్నగారైన ధర్మరాజు అనుజ్ఞ మేరకు నకులుడు దూరాన ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి, నీరు తాగబోయాడు. ఆ కొలను దగ్గర ఉన్న ఒక యక్షుడు.. ‘ఈ సరస్సు నాది. దీని మీద నాకు మాత్రమే అధికారం ఉంది. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే, నువ్వు నిశ్చింతగా నీరు తాగి వెళ్లవచ్చు’ అన్నాడు. నకులుడు ఆ మాటలు లెక్కచేయకుండా కొలనులోకి దిగాడు. నీరు తాగిన వెంటనే పడిపోయాడు. మిగిలిన ముగ్గురు కూడా అదే రీతిలో నీరు తాగి పడిపోయారు.
ధర్మరాజు తమ్ముళ్లను వెతుకుతూ వచ్చి, తమ్ముళ్లు అపస్మారకంగా పడి ఉండటం చూశాడు. ధర్మరాజు విషయం తెలుసుకున్నాడు. అప్పుడు యక్షుడు ధర్మరాజును పలు అంశాల మీద ప్రశ్నించాడు. ధర్మరాజు అన్ని ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పాడు. యక్షుడు సంతుష్టుడయ్యాడు.
‘ధర్మరాజా! నీ సమాధానాలకు నేను సంతోషించాను. నీ సోదరులలో ఒకరిని బతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో’ అన్నాడు. అందుకు ధర్మరాజు.. ‘అయ్యా! కుంతీ పుత్రులలో నేనున్నాను. మా పినతల్లి మాద్రి తనయులు ఇద్దరూ విగతజీవులయ్యారు. వారిలో నకులుని బతికించు’ అన్నాడు.
తన సొంత తమ్ముళ్లను కాక సవతి తల్లి కొడుకును బతికించమని అడిగినందుకు యక్షుడు ఆశ్చర్యపోయాడు. అతడి ధర్మ నిరతి చూసి సంతోషించాడు. ఆ సందర్భంలో ధర్మరాజు ఈ శ్లోకం పలికాడు. ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది. కనుక ధర్మాన్ని ఎన్నడూ విడువనని పలికాడు. అంతేకాదు.. దెబ్బతిన్న ధర్మం మనల్ని దెబ్బతీయరాదు కనుక.. తన తల్లులైన.. కుంతి, మాద్రి... ఇద్దరి బిడ్డలూ బతికి ఉండాలని తన కోరిక చెప్పాడు. అందుకు సంతోషించిన యక్షుడు అందరినీ బతికించాడు.
గాంధారి గర్భం ధరించిన సమయంలో.. కుంతికి తొలి సంతానం కలిగిందనే ఈర్ష్యతో గర్భతాడనం చేసుకుంది. అందుకే ఆవిడ గర్భాన.. ఈర్ష్య, అసూయలతో నిండిన సంతానం జన్మించారు. పుట్టినది మొదలు కౌరవులు... పాండవుల పట్ల అధర్మంగా ప్రవర్తిస్తూనే వచ్చారు. వారికి కర్ణుడు తోడయ్యాడు. వారంతా కన్నుమూసేవరకు ధర్మానికి విఘాతం కలిగేలా.. అధర్మమార్గాన్నే అనుసరిస్తూ వచ్చారు.
ఎంతో శక్తిసంపన్నులైన కురుపాండవులకు తాతగారే కాక ప్రథమ గురువు అయిన భీష్ముడు, అస్త్రవిద్యను నేర్పిన గురువులు ద్రోణుడు, అర్జునునితో సమానమైన పరాక్రమం గల కర్ణుడు... వంటి ఎందరో యోధులు కౌరవుల పక్షాన ఉన్నారు. అయినప్పటికీ పాండవుల మీద విజయం సాధించలేకపోయారు. వారంతా ధర్మాన్ని అతిక్రమించటం వల్లే వారిని ఆ ధర్మమే శిక్షించిందని వ్యాసుడు మనకు వివరిస్తున్నాడు.అనేక సందర్భాలలో ధర్మరాజు ధర్మం గురించి చెబుతూనే ఉంటాడు. అందుకే ధర్మానికి రాజు అయ్యాడు.
ఏది ధర్మమో తెలిసి, దానిని పాటించాడు. కనుక ధర్మం అతనిని కాపాడింది. మానవులు ఆచరించవలసిన ఇటువంటి సమస్త ధర్మాలను అందించినవారు వ్యాసమహర్షి.ఇక్కడ ధర్మం గురించి చెప్పిన వ్యాసమహర్షిని ఒక్కసారి స్మరించుకుందాం.
‘‘వ్యాసోచ్చిష్టం జగత్సర్వం’’ అని తెలిసిందే.నేటివరకూ మనం ఏ పని చేస్తున్నా, ఏ దైవాన్ని ప్రార్థిస్తున్నా, ఏ ఆలోచన చేసినా ... అంతా వ్యాసుడు బోధించినదే. మహాభారతమంతా ధర్మాన్నే బోధించాడు వ్యాసభగవానుడు.
-డా. పురాణపండ వైజయంతి-