ధరణితో రైతుల కష్టాలు

ధరణితో రైతుల కష్టాలు
  • 36 ఏండ్ల కింద అమ్మిన 8 ఎకరాల భూమి తమదంటూ వచ్చిన వారసులు
  • సాదాబైనామాలకు పట్టాలియ్యకుండా పెండింగ్​ పెట్టిన సర్కారు
  • ధరణి వల్ల అమ్మినోళ్ల పేరిటే పట్టా
  • రైతులపై  రియల్టర్లతో కలిసి వారసుల దాడి
  • మనస్తాపంతో పురుగుల మందు తాగిన తండ్రీ కొడుకులు
  • ఆదిలాబాద్​ జిల్లా కజ్జర్ల గ్రామంలో ఘటన

ఆదిలాబాద్​/ ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్​..​ ఓ రైతు కుటుంబంలోని తండ్రీకొడుకుల ప్రాణాల మీదికి తెచ్చింది. 36 ఏండ్ల కింద కొని సాగుచేసుకుంటున్న భూమికి తమపేరుతో కాకుండా అప్పట్లో అమ్మిన వ్యక్తి పేరుతోనే కొత్త పట్టాలు వచ్చాయి. తమ దగ్గర ఉన్న సాదాబైనామాను చూపి, పట్టాబుక్​ను తమ పేరుపై మార్చాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. 

ఈలోగా అప్పట్లో భూమి అమ్మిన వ్యక్తి వారసులు వచ్చి ఆ భూమి తమదని, పొలం నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. వినకపోవడంతో ఆదివారం కొందరు రియల్టర్లతో కలిసి వచ్చి రైతు కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన తండ్రీకొడుకులు పురుగుల మందు తాగారు. ఆదిలాబాద్​ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనలో యాళ్ల జైపాల్​రెడ్డి,  ఆయన కొడుకు చరణ్​ రెడ్డి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

ఇదీ నేపథ్యం..

జైపాల్​రెడ్డి తండ్రి యాళ్ల రాజారెడ్డి 36 ఏళ్ల క్రితం మావల గ్రామానికి చెందిన అబ్దుల్​ ఘనీ నుంచి 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో బాండ్​ పేపర్​​ మీద రాయించుకున్నాడు. అప్పటి నుంచి భూమి సాగుచేసుకుంటున్నప్పటికీ నిరక్షరాస్యులు కావడంతో పట్టా చేయించుకోలేదు. మూడేండ్ల కింద రాజారెడ్డి చనిపోవడంతో భూమి పట్టా కోసం ఆయన కొడుకు జైపాల్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. సాదాబైనామా ఉన్నవాళ్లందరికీ పట్టాలిస్తామని సర్కారు హామీ ఇచ్చినా నెరవేరలేదు. రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఈలోగా ధరణి రావడంతో అంతకుముందు ఎలాంటి పట్టా లేని అబ్దుల్​ఘనీ పేరిట కొత్త పట్టా పాస్​బుక్​ వచ్చింది. దీంతో ఆ భూమి తమదేనని, ఖాళీ చేసి తమకు అప్పగించాలని ఘనీ కొడుకులు టీఆర్​ఎస్​ నేత ఆసిఫ్​, యూసుఫ్​లు.. జైపాల్​రెడ్డి, ఆయన కొడుకు చరణ్​​రెడ్డిని బెదిరించారు. పొలంలోకి అడుగు పెట్టవద్దంటూ దౌర్జన్యం చేశారు. ఎప్పట్లాగే ఆదివారం ఉదయం జైపాల్​ రెడ్డి, ఆయన భార్య వెంకటమ్మ, చరణ్​ రెడ్డి పొలానికి వెళ్లారు. అయితే, ఆ భూమిని రియల్​ ఎస్టేట్​ వ్యాపారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఆసిఫ్​, యూసుఫ్​లు.. అనుచరులు, రియల్​ మాఫియాతో కలిసి వచ్చి అన్నం తింటున్న జైపాల్​రెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన జైపాల్​రెడ్డి, చరణ్​ రెడ్డి అక్కడే పురుగుల మందు తాగారు.  చుట్టుపక్కల ఉన్న రైతులు వారిని ఆదిలాబాద్​ రిమ్స్​కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఐదు గంటలు రాస్తారోకో

దాడి  గురించి తెలుసుకున్న కజ్జర్ల గ్రామస్తులు.. రిమ్స్​కు పెద్ద సంఖ్యలో వచ్చారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులతో కలిసి  రిమ్స్​ ఎదుట నేషనల్​ హైవేపై బైఠాయించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 దాకా రాస్తారోకో చేశారు. ఆసిఫ్​ టీఆర్​ఎస్​కు చెందినవాడు కావడం వల్లే  రెవెన్యూ అధికారులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రియల్​ఎస్టేట్​ మాఫియాతో కలిసి  జైపాల్​రెడ్డి, పెదేల్లి స్వామి అనే వ్యక్తుల భూములను  లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని బాధితులు వాపోయారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్​ను మళ్లించారు. ఘటనపై విచారణ చేయిస్తామని, బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్​ అడిషనల్​ కలెక్టర్​ నటరాజన్​హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, దాడి ఘటనపై వెంకటమ్మ పోలీసులకు 
ఫిర్యాదు చేసింది.   

అన్నం తింటుండంగా దాడి 

పొలంలో చెట్టు కింద అన్నం తింటుండగా 20 మంది ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. ఆ బాధతో మా ఆయన, కొడుకు పురుగుల మందు తాగారు. 36 ఏళ్ల కిందట్నే అబ్దుల్​ ఘనీ దగ్గర మా మామ భూమి కొన్నడు. మా భూమిని వాళ్లు దౌర్జన్యంగా పట్టా చేసుకున్నరు. ఆ పట్టాలను రద్దు చేసి వాళ్లను అరెస్ట్ చేయాలె. మా పొలానికి పక్కన ఉన్న వ్యక్తి భూమినీ కబ్జా చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న, అధికారుల వద్దకు వెళ్లినా మాకు న్యాయం జరగలేదు. 
‌‌‌‌- యాళ్ల వెంకటమ్మ, జైపాల్ రెడ్డి భార్య 
 

మరిన్ని వార్తల కోసం...

హిస్టరీ రికార్డ్: 14వసారీ.. రప్పాడించిన రఫెల్..!

ఉత్తరాఖండ్ లో లోయలో పడిన బస్సు : 17 మంది మృతి