ధరణి బాధ్యతలు కేంద్ర సంస్థ ఎన్ఐసీకి?

ధరణి బాధ్యతలు కేంద్ర సంస్థ ఎన్ఐసీకి?

 

  • కేంద్ర సంస్థకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • సీజీజీకి ఇచ్చేందుకు తొలుత కసరత్తులు
  • ఇందులో కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్​మెంట్!
  • దీంతో నిర్వహణ పకడ్బందీగా ఉంటుందని ఎన్‌‌ఐసీ వైపు మొగ్గు!
  • మాడ్యూళ్లలో ఈజీగా మార్పులు చేయొచ్చని సర్కారు ఆలోచన

హైదరాబాద్, వెలుగు: ధరణిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోర్టల్‌‌‌‌‌‌‌‌లోని లోపాలను గుర్తించి, సరిచేసే కొత్త వ్యవస్థపై సిఫార్సులను చేసేందుకు ఓ కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ధరణిని పూర్తిగా ఎత్తేయాలా? లేదా పేరు మార్చి సైట్‌‌‌‌‌‌‌‌లో సవరణలు చేయాలా? అనే దానిపై కసరత్తులు చేస్తున్నది. అందులో భాగంగా ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిపై ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపాలని కమిటీ యోచిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి ధరణి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు తొలుత చర్చలు జరిగాయి. అయితే ఎన్ఐసీకి ఇస్తేనే సైట్ నిర్వహణ పకడ్బందీగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ధరణితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ రైతులు, భూ యజమానులు, హక్కుదారుల హక్కులను కాపాడేలా ధరణిని పటిష్ఠపరచాలని సర్కారు భావిస్తున్నది.

పేరు మారుస్తరా.. సైట్‌‌‌‌‌‌‌‌నే మార్చేస్తరా?

ధరణిని ఎత్తేసి దాని స్థానంలో మరో పటిష్ఠమైన వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ‘భూమాత’ అనే వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు ధరణిని పూర్తిగా ఎత్తేయాలా? లేదంటే పేరు మార్చి ఆ వ్యవస్థలో సవరణలు చేయాలా? అన్నదానిపైనా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ధరణిలోని లోపాలను సరిదిద్ది.. పలు సవరణలు చేయాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చినప్పటి నుంచీ రైతులు దాని వల్ల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడో కొని సాగు చేసుకుంటున్న భూములు.. గతంలో అమ్మినోళ్ల పేర్లతో రిజిస్టర్ అయినట్టుగా పోర్టల్‌‌‌‌‌‌‌‌లో కనిపించాయి. పట్టాభూములు ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. కొన్ని నిషేధిత జాబితాలోనూ చేరాయి. విస్తీర్ణంలో తేడాలు, పేర్లలో తప్పులు, సర్వే నంబర్లలో తప్పుల వంటివి బయటపడ్డాయి. ధరణితో చాలా చోట్ల భూములు కబ్జాలకూ గురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్​లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా ధరణి సమస్యలపైనే బాధితుల దరఖాస్తులు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అలాంటి తప్పులేవీ జరగకుండా ఉండేలా ఆ సైట్​లో కీలకమైన సవరణలను చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. పేరు కూడా మారుస్తారన్న చర్చ జరుగుతున్నది.

ఎన్ఐసీ ఎందుకు?

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి నిర్వహణను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల రైతుల డేటా సేఫ్‌‌‌‌‌‌‌‌గా ఉండదని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి పకడ్బందీ వ్యవస్థేనని నాటి సీఎం కేసీఆర్ వెనకేసుకొచ్చారు. సంస్థ గడువు తీరినా.. మళ్లీ పొడిగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అధీనంలోనే ఉండేలా చూసుకుంటున్నది. ఈ క్రమంలోనే తొలుత సీజీజీకి అప్పగించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే సీజీజీలోనూ కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్​మెంట్ ఉంటుందని, సొంత నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఉన్న ఎన్ఐసీకి ఇస్తే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని మాడ్యూళ్ల విషయంలో ఎన్ఐసీ త్వరగా పరిష్కారాలు చూపేందుకు వీలవుతుందని తెలుస్తున్నది. కానీ సీజీజీ దగ్గర అలాంటి వ్యవస్థ లేదని చెప్తున్నారు. ధరణి వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు, మాడ్యూళ్లను యాడ్ చేయడం, తొలగించడం వంటి పనులు ఎన్ఐసీతో సులువుగా అయిపోతాయని భావిస్తున్నారు. ఎన్ఐసీ వద్ద ఆధార్ డేటా కూడా ఉంటుంది కాబట్టి.. ధరణిలో నమోదైన వారి వివరాలూ కట్టుదిట్టంగా ఉంటాయని యోచిస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉండడంతో పాటు.. అవకతవకలకు అవకాశం ఉండదని అంటున్నారు. దీంతో ఎన్ఐసీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి ఇదింకా ప్రతిపాదనల దశలోనే ఉన్నదని, సీజీజీ, ఎన్ఐసీలో దేనికి ధరణి బాధ్యతలు ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చర్చించిన తర్వాతే క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు.

టెర్రాసిస్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ దాకా!

ప్రస్తుతం ధరణిని నిర్వహిస్తున్న టెర్రాసిస్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ దాకా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఎక్స్‌‌‌‌‌‌‌‌టెన్షనే కాబట్టి.. మధ్యలోనే రద్దు చేసేందుకు అవకాశాలున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే అది ఆ సంస్థతో మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌‌‌‌‌‌‌‌తోనే సాధ్యమైతుందని అంటున్నారు. ఒకవేళ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వ సంస్థకే ఇవ్వాలని సర్కారు భావిస్తే.. కాంట్రాక్ట్ నుంచి తప్పుకునేందుకు టెర్రాసిస్ కూడా సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తున్నది. దీనిపై లీగల్ సహా అన్ని రకాలుగా ఒపీనియన్లు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.