కేసీఆర్‌‌‌‌కు‌‌ కృష్ణాజలాలపై  మాట్లాడే అర్హత లేదు : ధర్మార్జున్

కేసీఆర్‌‌‌‌కు‌‌ కృష్ణాజలాలపై  మాట్లాడే అర్హత లేదు : ధర్మార్జున్

సూర్యాపేట, వెలుగు:మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌కు కృష్ణాజలాలపై మాట్లాడే అర్హత లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. ఫిబ్రవరి 11న నల్గొండ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కృష్ణా జలాల్లో వాటాపై కేంద్రం వివక్ష, బీఆర్‌‌‌‌ఎస్‌‌ నిర్లక్ష్యం, దగాపడ్డ నల్గొండ’ సదస్సు పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం, నల్గొండ గోస నీళ్ల కోసమేనని.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ గోస తీరుతుందనుకుంటే మరింత అన్యాయం జరిగిందని వాపోయారు.  

కేంద్రం కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా ఇవ్వకపోవడమే కాకుండా.. మొత్తం జలవనరుల మీద గుత్తాధిపత్యం కోసం గెజిట్ తీసుకొస్తే కేసీఆర్‌‌‌‌ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.  కృష్ణా ప్రాజెక్టులపై హక్కులు కోల్పోతామని తెలిసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.  అప్పట్లోనే పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు 2023 జనవరి 30న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశామని గుర్తుచేశారు. టీజేఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిణ కిరణ్ కుమార్, రైతు సమితి జిల్లా కోకన్వీనర్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మ గాని వినయ్ గౌడ్, నేతలు సుమన్, వలికి రాజు, సతీశ్,  మల్సూర్, దేవత్ సతీశ్,  బల్గురి గోపి, స్వామి పాల్గొన్నారు.