కలెక్టర్​ రావాలంటూ..ప్రజావాణిలో ధరణి బాధితుడి ధర్నా

కలెక్టర్​ రావాలంటూ..ప్రజావాణిలో ధరణి బాధితుడి ధర్నా
  • నాగర్​కర్నూల్​ కలెక్టరేట్​లో బైఠాయింపు 
  • గంట సేపు కూర్చున్నా ఒక్క అధికారీ​ పట్టించుకోలే
  • నిరాశగా వెళ్లిపోయిన బాలస్వామి

నాగర్ కర్నూల్, వెలుగు : ‘భూమి కొని నాలుగేండ్లు దాటింది. తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగిన. ఇప్పుడు కలెక్టరేట్ ​చుట్టూ తిరుగుతున్నా. కలెక్టర్ ​లాగిన్​లో ఉంది. ఇంకా ఎన్నేండ్లు తిరగాలో అర్థమైతలేదు. కలెక్టర్​వచ్చి నా సమస్యకు పరిష్కారం చూపాలి’ అంటూ ధరణి బాధితుడొకరు సోమవారం నాగర్​కర్నూల్​కలె క్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో నేలపై బైఠాయించాడు. తాడూరు మండలం గుంతకోడూరు గ్రామానికి చెందిన బాధితుడు బాలస్వామి గౌడ్​మాట్లాడుతూ తాను నాలుగేండ్ల కింద ఎకరా భూమి కొన్నానని

పట్టా కోసం నాలుగేండ్లుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నాడు. ఇప్పటివరకు దాదాపు రూ.40లక్షల వరకు ఖర్చు పెట్టానని, ఇంకా ఏం ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో...ఏం చేయాల్సి వస్తుందో అర్థం కావడం లేదన్నాడు. తనకు కలెక్టర్ ​లాగిన్​లో ఓకే అయితే పట్టా వస్తుందంటున్నాడు.

గంట సేపు బైఠాయించినా ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయాడు. సోమవారం నాగర్​కర్నూల్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో 92 దరఖాస్తులు వస్తే, అందులో 65 భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి.