
యూరప్‌లో విపరీతమైన వేడి, అమెరికా మిడ్ వెస్ట్‌లో ఎన్నడూ లేనంతగా దంచికొడుతున్న వానలు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో టెంపరేచర్‌లో తేడాలు.. చైనాలో 60 ఏళ్లలో చూడని వర్షాలు, నీళ్ల కోసం నోరు తెరుచుకున్న ఆసియాలోనే పెద్ద నది మెకాంగ్, దక్షిణ ఇండియాలో మంచి నీళ్లూ దొరకనంత కరువు.. ఒక్క ఏడాదిలో వాతావరణం దాదాపు అన్ని ప్రాంతాలకు చుక్కలు చూపించింది. వేలాది మంది ప్రజల జీవనోపాధికి బ్రేకులేసింది. వరి, రబ్బరు, చెరకు పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న కాలుష్యంతో వాతావరణంలో రకరకాల మార్పులొస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు అసలు వానలే పడవనుకున్న చోట వరదలు, మస్తు వర్షాలు పడతాయనుకున్న ప్రాంతాల్లో కరువులు, చల్లని ఏరియాల్లో వేడి గాలులు, ఉష్ణోగ్రత ఎక్కువుండే ప్రాంతాల్లో టెంపరేచర్ మార్పులు కనబడుతున్నాయి.
చైనాలో ఉత్తరాన కరువు, దక్షిణాన వరద
ప్రపంచవ్యాప్తంగా వరి, జొన్న ఉత్పత్తిల్లో చైనాది తొలి స్థానం. మొక్కజొన్న ఉత్పత్తిల్లో రెండో ప్లేస్. కానీ ఈ ఏడాది ఆ దేశం ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో చాలా వరకు పంటలు ఎండిపోయాయి. ఇరిగేషన్ వ్యవస్థ బాగుండటంతో ప్రభావం తగ్గింది. దీనికి పూర్తి వ్యతిరేకంగా దక్షిణ చైనా ప్రాంతాల్లో జులై ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. ఎంతలా అంటే 1961 తర్వాత ఆ రేంజ్‌లో వానలు పడలేదు. దీంతో ఓవైపు వరి పంట దెబ్బతినడమే కాకుండా మరోవైపు పంటలపై పురుగుల దాడి ఎక్కువైంది.
ఇండియాలో చెరకు, నూనె పంటలకు దెబ్బ
చెరకు ఉత్పత్తిల్లో బ్రెజిల్‌ను దాటి ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంది. కానీ ఈ ఏడాది ఉత్పత్తి చాలా వరకు తగ్గనుంది. గత మూడేళ్లతో పోల్చితే ఈసారి తక్కువ ఉత్పతి జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కారణం ఈ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. దీంతో మహారాష్ట్ర, కర్నాటకల్లో చెరకు దిగుబడి బాగా తగ్గింది. దీంతో విదేశాలకు ఎగుమతి తగ్గింది. నూనె పంటల ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో విదేశాల నుంచి వంటలో వాడే ఆయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక, ప్రపంచంలో పామ్ ఆయిల్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఇండోనేసియా, మలేసియా. ఇప్పటికే జావా ద్వీపంలో వర్షాలు సరిగా కురవక వరి పంటపై ప్రభావం పడింది. ఈ ప్రాంతంలో గత 60 రోజులుగా వానలే లేవు. దీంతో వరి, రబ్బరు పంటలు దెబ్బతిన్నాయి. అయితే కాఫీ ఎక్కువగా పండే సెంట్రల్ హైలాండ్స్‌లో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు. వర్షాలు ఎక్కువ కురిసే ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతం ఇప్పుడు నీళ్లు లేక అల్లాడుతోంది. రెండేళ్లుగా కరువుతో సతమతమవుతోంది.