నిజాంసాగర్ లో ​కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది

నిజాంసాగర్ లో ​కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది

రాళ్లు కూలటంతో  పాత బ్రిడ్జిని బంద్​ చేసిన ఆఫీసర్స్​

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి నుంచి నిజాంసాగర్​ మండలం మీదుగా నాందేడ్​ హైవేతోపాటు పిట్లం, మద్నూర్, జుక్కల్, సంగారెడ్డి వైపు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.  నేషనల్​ హైవేతో స్టేట్​ హైవేను కనెక్ట్​ చేసే ఈ మార్గంలో నిజాంసాగర్​ మండలకేంద్రంలో దశాబ్దాల కింద నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. వాహనాల రాకపోకలతో బ్రిడ్జి రాళ్లు పడిపోయాయి.  భారీవాహనాలు ప్రయాణం సాగిస్తే మరింత ఒత్తిడికి గురై బ్రిడ్జి పడిపోయే ప్రమాదముందని భావించిన ఆఫీసర్లు రాకపోకలు బంద్​చేశారు. 

రూ.25కోట్లతో కొత్త బ్రిడ్జి 

పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ఐదేండ్ల కింద కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు పనులు షురూ చేశారు. రూ.25కోట్లతో స్టార్ట్​ చేసిన  నిర్మాణం ఇటీవల కంప్లీట్​అయింది. నిర్మాణ పనులు కంప్లీట్​ అయినప్పటికీ బ్రిడ్జిపై రోడ్డు, అప్రోచ్​ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాత బ్రిడ్జిని బంద్​చేయడంతో కొత్త దానిపై నుంచి వాహనాలను అనుమతించాల్సిన పరిస్థితి. బ్రిడ్జిపై అప్రోచ్​రోడ్డుపై బీటీ వేయకపోవడంతో కంకర రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గుంతలు ఏర్పడి  వాహనదారులు అవస్థలు పడుతున్నారు.