వ్యాక్సిన్​ వేయించుకున్నొళ్లకు డిజిటల్ సర్టిఫికేట్

వ్యాక్సిన్​ వేయించుకున్నొళ్లకు డిజిటల్ సర్టిఫికేట్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లు లేవంటూ కొన్ని రాష్ట్రాల్లోని టీకా కేంద్రాల్లో నో స్టాక్​ బోర్డులు పెట్టేస్తున్నారు. ఆన్​లైన్​లో వ్యాక్సిన్​ కోసం బుక్​చేసుకుని వచ్చిన వాళ్లనూ తిప్పి పంపించేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్​ వేవ్​తో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు కరోనా వ్యాక్సిన్​ వేసుకునేందుకు భారీగా ముందుకు రావడంతో.. కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్​ పెరిగింది. ఆ డిమాండ్​కు తగ్గట్టు వ్యాక్సిన్​ ప్రొడక్షన్​ను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అయితే, ప్రొడక్షన్​ను పెంచినా డిమాండ్​కు తగ్గ సరఫరాను అందుకోవాలంటే మాత్రం మరికొన్ని వారాలు పట్టే అవకాశమున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

5 కోట్ల డోసులను పంపిస్తున్న కేంద్రం
వాటితో పాటు జాన్సన్​ అండ్​ జాన్సన్​ తన సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​ ట్రయల్స్​కు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. బయోలాజికల్​–ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్​, జైడస్​ క్యాడిలా జైకొవ్​డీలపై ట్రయల్స్​ నడుస్తున్నాయి. వాటి వాడకానికీ ఆమోదం లభిస్తే దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతమున్న అవసరానికి తగ్గట్టు వివిధ రాష్ట్రాలకు 5 కోట్ల కరోనా వ్యాక్సిన్​ డోసులను పంపిస్తున్నట్టు ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. ఆ వ్యాక్సిన్లు దాదాపు రెండు వారాల పాటు సరిపోతాయని చెప్పారు. 

కొవాగ్జిన్​.. 70 కోట్ల డోసులు
భారత్​ బయోటెక్​ కూడా ప్రొడక్షన్​ను రెండింతలు చేయనుంది. ప్రస్తుతం రోజూ 2 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తున్న కంపెనీ.. వచ్చే నెల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెలలో బెంగళూరులోని కంపెనీ మాన్యుఫాక్చరింగ్​ యూనిట్​కు భారీ బయోరియాక్టర్​ వస్తుందని, దీంతో ప్రొడక్షన్​ను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి 20 కోట్ల డోసులను తయారు చేయాలని ప్లాన్​ చేసుకుంది. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్లతో ఏటా 70 కోట్ల డోసులను తయారు చేసేలా ఈ డిసెంబర్​ నాటికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అదనంగా 50 కోట్ల డోసులను పెంచుతామన్నారు. కాగా, జులై–ఆగస్టు నాటికి 15 కోట్ల కొవాగ్జిన్​ డోసులు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ చైర్మన్​ కృష్ణ ఎల్లా ఇదివరకే ప్రకటించారు. 

కొవిషీల్డ్​.. ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులు
ప్రస్తుతం దేశంలో సీరమ్​ ఇనిస్టిట్యూట్​ కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ వ్యాక్సిన్లను వాడుతున్నారు. ప్రస్తుతం సీరమ్​ నెలకు 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు డోసులను తయారు చేస్తోంది. వచ్చే నెల నుంచి దానిని 10 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. నిజానికి గత జనవరి నుంచే ప్రొడక్షన్​ను 10 కోట్ల డోసులకు పెంచాల్సి ఉన్నా.. ముడిసరుకు కొరతతో అది సాధ్యపడలేదని ఆ కంపెనీ సీఈవో ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ టార్గెట్​ కాస్తా మే నెలకు మారింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్లను బట్టి ఆగస్టు నాటికి 47 కోట్ల డోసులను తయారు చేసేందుకు ప్లాన్లను సిద్ధం చేసి పెట్టుకుంది. 

స్పుత్నిక్​.. 87.5 కోట్లు
రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​Vని తయారు చేసేందుకు డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​తో రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్​ఎఫ్​ఐడీ) ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులివ్వాల్సిందిగా కేంద్రానికీ కంపెనీ అర్జీ పెట్టుకుంది. అయితే, మన దేశంలో మొత్తంగా 87.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేలా ఆర్​ఎఫ్​ఐడీ ఒప్పందాలు చేసుకుంది. హెటిరో బయోఫార్మా, గ్లాండ్​ ఫార్మా, విర్చో బయోటెక్​, పనాసీ బయోటెక్​, స్టెలిస్​ బయోఫార్మాలతోనూ జట్టు కట్టింది. ఉత్పత్తి అయిన డోసుల్లో 42.6 కోట్ల డోసులను దేశంలో వాడుకునేందుకు వీలుగా ఒప్పందం చేసుకుంది. 

టీకా వేసుకున్నోళ్లకు డిజిటల్​ సర్టిఫికెట్​
కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నోళ్లకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే ‘డిజిటల్​ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​’ను ఇచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్​ సర్టిఫికెట్​ ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్​వో.. ఫాస్ట్​ హెల్త్​కేర్​ ఇంటర్​ఆపరబిలిటీ రీసోర్సెస్​ (ఎఫ్​హెచ్​ఐఆర్​)ను ఏర్పాటు చేయడంపై కసరత్తులు చేస్తోందని, అది ఖరారయ్యాకు దాని ప్రమాణాలకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వమూ డిజిటల్​ సర్టిఫికెట్​ ఇస్తుందని నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సినేషన్​ అడ్మినిస్ట్రేషన్​లో సభ్యుడైన రామ్​ సేవక్​ శర్మ చెప్పారు. ఆ సర్టిఫికెట్​ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటవుతుందన్నారు. 

వ్యాక్సిన్​ తీసుకున్నా కరోనా ఎందుకు సోకుతోంది?
వ్యాక్సిన్​ తీసుకున్నా చాలా మందికి కరోనా సోకుతోంది. మన దేశంలోనే కాదు.. అమెరికా వంటి బయటి దేశాల్లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వీటినే ‘బ్రేక్​ త్రూ కేసెస్​’ అంటున్నారు. దానికి మొదటి కారణం వ్యాక్సిన్​ను సరిగా వేయకపోవడమేని నిపుణులు చెబుతున్నారు. భుజంపై సరైన చోట టీకాను వేయకపోతే దాని పనితీరు మందగిస్తుందని అంటున్నారు. నిర్ణయించిన టెంపరేచర్లలో వ్యాక్సిన్​ను నిల్వ చేయకపోయినా పనితీరు తగ్గిపోతుందని, ఫలితంగా వైరస్​ సోకుతుందని చెబుతున్నారు.  వ్యాక్సిన్​ వేసుకున్న వ్యక్తిలో ఇమ్యూన్​సిస్టమ్​ స్పందన సరిగ్గా లేకున్నానా వైరస్​ సోకే అవకాశం ఉందంటున్నారు. వయసు మళ్లడం, ఎక్కువ కాలం పాటు మందులు వాడటం, వేరే జబ్బులకు ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఉండటం, జెనెటిక్​ సమస్యలుండటం వంటి కారణాల వల్ల ఇమ్యూన్​ సిస్టమ్​ స్పందన తగ్గొచ్చని చెబుతున్నారు. 

పేద దేశాలకు సెకండ్​ డోస్​ అందట్లె
డబ్బున్న దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్​ వేగంగానే జరుగుతున్నా.. పేద దేశాలు మాత్రం వెనుకబడిపోతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో ఫస్ట్​ డోస్​ వ్యాక్సినేషన్​ మొదలైనా.. కొన్ని పేదదేశాలకు సెకండ్​ డోస్​ అందని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 60 దేశాలు కేవలం ఫస్ట్​ డోస్​ వద్దే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పేద దేశాలకూ వ్యాక్సిన్​ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్​వో ఏర్పాటు చేసిన ‘కొవాక్స్​’ గ్రూప్​.. సోమవారం నుంచి ఆయా దేశాలకు వ్యాక్సిన్లను పంపలేదు. ఇప్పటిదాకా పంపించిన వాటిలోనూ అత్యధికంగా ఒక్కరోజులో 25 వేల వ్యాక్సిన్లనే ఒక్కో పేద దేశానికి పంపించింది. యునిసెఫ్​ లెక్కల ప్రకారం గడిచిన రెండు వారాల్లో 92 దేశాలకు కేవలం 20 లక్షల డోసులనే కొవాక్స్​ పంపించింది. డబ్బున్న దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే.. పేద దేశాల్లో 500 మందిలో ఒకరికే టీకా అందిందని డబ్ల్యూహెచ్​వో చెప్పింది.