పల్లెల్లో పెరగని డిజిటల్ పేమెంట్స్

పల్లెల్లో పెరగని డిజిటల్ పేమెంట్స్

గ్రామాల్లో డిజిటల్​ పేమెంట్లపై నమ్మకం లేకపోవడమే కారణం

ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిల్ అయితే డబ్బులు తిరిగి రావనే భయం 

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: నాలుగేళ్ల క్రితం నోట్ల రద్దుతో దేశంలో డిజిటల్ పేమెంట్స్‌‌ సర్వీసెస్‌‌కు మంచి ఊపొచ్చింది. దీనికి తోడు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌‌ ఇండియా ప్రోగ్రామ్‌‌తో ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలూ పెరిగాయి. ఆధార్, జన్‌‌ధన్‌‌లతో పాటు, దేశంలో స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడకం కూడా పెరగడంతో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ సర్వీస్‌‌లు రికార్డ్‌‌ స్థాయిలను తాకుతున్నాయి. కానీ, గ్రామీణ, సెమీ అర్బన్‌‌ ప్రాంతాలలో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ వాడకం ఇంకా తక్కువగానే ఉంది.  ఈ ప్రాంతాలలోని కన్జూమర్లు డిజిటల్‌‌ పేమెంట్స్ కంటే క్యాష్‌‌ పేమెంట్స్‌‌నే ఎక్కువగా వాడుతున్నారు.

డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై కన్జూమర్లకు నమ్మకం లేకపోవడంతోనే వీటి వాడకం ఇంకా విస్తరించలేదని ఎనలిస్టులు అంటున్నారు. కన్జూమర్లలో నమ్మకం తగ్గడానికి రెండు కారణాలున్నాయని  ఫైనాన్షియల్‌‌ కంపెనీ ద్వరాకు చెందిన ఎనలిస్ట్‌‌ శ్రీకర ప్రసాద్‌‌ అన్నారు. మొదటిది డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ నచ్చకపోవడం కాగా, రెండోది ట్రాన్సాక్షన్‌‌లో ఏదైనా తప్పు జరిగితే మనీ తిరిగి అందకపోవడం వంటి కారణాలున్నాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ పేమెంట్స్‌‌ను వాడేటప్పుడు కన్జూమర్ల మనీని కొన్ని సార్లు ఫ్రాడ్స్‌‌ కొట్టేస్తుండడం, పేమెంట్ ప్రాసెస్‌‌ అర్థం  కాకపోవడం,  పర్సనల్‌‌ డేటా దొంగతనానికి గురవుతుందనే భయపడడం వంటి కారణాలతో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై కన్జూమర్లకు నమ్మకం తక్కువగా ఉందని చెప్పారు.

ఫెయిలైన ట్రాన్సాక్షన్‌‌పై ఎక్కడ ఫిర్యాదు చేయాలో..

లాక్‌‌డౌన్‌‌ తర్వాత దేశంలో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ మరింతగా విస్తరించాయి. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో 207 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని ఎన్‌‌పీసీఐ డేటా చెబుతోంది. వీటి విలువ సుమారు రూ. 3.86 లక్షల కోట్లకు పైనే.  లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో ఆధార్‌‌‌‌ ఎనాబుల్డ్‌‌ పేమెంట్‌‌ సిస్టమ్‌‌(ఏఈపీఎస్‌‌) వాడకం పెరిగిందని ప్రసాద్‌‌ అన్నారు.  కానీ, ఏఈపీఎస్‌‌ ద్వారా జరిపిన ట్రాన్సాక్షన్లలో 39 శాతానికి పైగా ట్రాన్సాక్షన్లు  ఫెయిల్‌‌ అయ్యాయని అన్నారు. వేరు వేరు కారణాలతో ఈ ట్రాన్సాక్షన్లు పెయిల్‌‌ అయ్యాయని చెప్పారు. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై కన్జూమర్ల నమ్మకం తగ్గడానికి ఇలాంటివి కారణమవుతున్నాయని అన్నారు. పెరుగుతున్న  ట్రాన్సాక్షన్‌‌ ఫెయిల్యూర్స్‌‌తో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై కన్జూమర్లకు నమ్మకం తక్కువగా ఉందని చెప్పారు. ఈ ట్రాన్సాక్షన్లలో పోయిన డబ్బులు తిరిగి పొందడంలో కన్జూమర్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో కన్జూమర్లకు చేదు అనుభవం ఎదురైతే ముందుగా పేమెంట్స్‌‌ యాప్‌‌, బ్యాంకులు, పోలీసులు, కన్జూమర్‌‌‌‌ లేదా సివిల్‌‌ కోర్టుకు వెళతారు. కానీ ఒక్కొక్క కారణాన్ని బట్టి ఇందులో దేనిని అప్రోచ్‌‌ అవ్వాలో కన్జూమర్లకు తెలియడం లేదని ప్రసాద్‌‌ అభిప్రాయ పడ్డారు. ఎక్కువ సార్లు కన్జూమర్లు తప్పుడు ఫారమ్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరుగుతోందని, ఈ ఫిర్యాదులు రిజక్ట్‌‌ అవుతున్నాయని చెప్పారు. దీంతో ఫెయిలైన ట్రాన్సాక్షన్లకు సరియైన పరిష్కారం దొరకదని కన్జూమర్లు ఫీలవుతున్నారని పేర్కొన్నారు. 2018–19 లో బ్యాంక్‌లకు 1,95,901 ఫిర్యాదులు అందాయని, ఇది 2017–18 లో అందిన ఫిర్యాదులు 1,63,690 కంటే 19.75 శాతం ఎక్కువని ప్రసాద్‌‌ చెప్పారు. 2018–19 లో అందిన ఫిర్యాదులలో 52.90 శాతం కంప్లైంట్లు రిజక్ట్‌‌ అయ్యాయని గుర్తు చేశారు. దీనికి కారణం తప్పుడు ఫారమ్‌‌ను కన్జూమర్లు ఎంచుకోవడం, సంబంధిత బ్యాంకుకు మొదట వెళ్లకపోవడమేనని అన్నారు. వీటితో పాటు కస్టమర్ల నుంచి వివిధ డాక్యుమెంట్లను బ్యాంకులు అడుగుతాయి.

డిజిటల్ పేమెంట్స్‌‌‌‌ పెరగాలంటే..

టెక్నాలజీని మరింత డెవలప్‌‌ చేయడం, కన్జూమర్ల డేటాను  ప్రొటెక్ట్‌‌ చేయడం, పేమెంట్స్‌‌లో ఎదురయ్యే సమస్యలను తగ్గించడం, సర్వీస్‌‌లను పెంచడం ద్వారా డిజిటల్‌‌ పేమెంట్స్‌‌పై కన్జూమర్లకు ఆసక్తి పెరుగుతుందని ప్రసాద్‌‌ అన్నారు. ఆఫ్‌‌లైన్‌‌లో కూడా పేమెంట్స్‌‌ జరిగే టెక్నాలజీని పేమెంట్‌‌ సర్వీస్ ప్రొవైడర్లు, రెగ్యులేటరీ అందుబాటులోకి తేవాలని చెప్పారు. లోకల్‌‌ లాంగ్వేజ్‌‌లోనే సర్వీస్‌‌లను అందించడం ద్వారా కస్టమర్లకు ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఫెయిలైన ట్రాన్సాక్షన్లను వేగంగా పరిష్కరించాలని చెప్పారు.