సీతాఫలాలతో వంటకాలు

సీతాఫలాలతో వంటకాలు

సీజన్​లో మాత్రమే దొరికే సీతాఫలాన్ని అస్సలు మిస్​ కాకూడదు. ఎందుకంటే ఇందులో ప్రొటీన్, ఫైబర్, మినరల్స్, తక్కువ ఫ్యాట్​ ఉంటాయి. ఇది తింటే బోలెడు శక్తి వస్తుంది. అంతేకాదు.. ఈ పండులో విటమిన్ సి, బి 6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. ఎన్ని పండ్లు తింటాం? రెండు తినగానే చాలు అనిపిస్తుంది కదా. ఆ తరువాత ఎప్పుడైనా తినాలనిపించినా అవి దొరకవు. కాబట్టి.. దొరికినప్పుడే ఇదిగో ఇలా వంటల్లో ట్రై చేయొచ్చు. 

మఫిన్స్

కావాల్సినవి :
సీతాఫలాలు  –  మూడు, చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ – అర టీస్పూన్
కోడిగుడ్డు – ఒకటి, పాలు – ఒక కప్పు
గోధుమపిండి – ఒక కప్పు, కొబ్బరి పొడి – అర కప్పు, బేకింగ్ సోడా – పావు టీస్పూన్
బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్, వాల్​నట్స్ తరుగు, డార్క్ చాకో చిప్స్ – పావు కప్పు

తయారీ :

సీతాఫలం గింజలు తీసేసి, గుజ్జు తీసుకోవాలి. ఒక గిన్నెలో గుజ్జు, చక్కెర లేదా బ్రౌన్ షుగర్, వెనిలా ఎసెన్స్, కోడిగుడ్డు, పాలు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో గోధుమ పిండి, కొబ్బరి పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలిపి జల్లెడ పట్టాలి. ఆ రెండింటినీ కలిపితే ముద్ద అవుతుంది. అందులో కొంచెం కొంచెంగా పాలు పోసి కలపాలి. ఆ తర్వాత డార్క్ చాకో చిప్స్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కప్పుల్లో పెట్టి వాల్​నట్స్ తరుగు చల్లి స్టీల్​ ప్లేట్​ మీద ఉంచాలి. 
ఒక పాన్​లో ఉప్పు వేసి అందులో స్టాండ్ పెట్టాలి. ఆ స్టాండ్​ పై మఫిన్ ప్లేట్​ పెట్టి దానిపై మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి, టూత్​ పిక్​తో మఫిన్ ఉడికిందో లేదో చూడాలి. ఉడికాక కప్పుల్లో నుంచి తీసేసి చాకొలెట్ సిరప్​తో డెకరేట్ చేసి తింటే చాలా బాగుంటుంది.

బాసుంది

కావాల్సినవి : 

సీతాఫలం గుజ్జు – ఒక కప్పు, పాలు – ఒకటిన్నర లీటరు
యాలకుల పొడి – ఒక టీస్పూన్, చక్కెర – ఐదు టేబుల్ స్పూన్లు
బాదం, పిస్తా తరుగు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ :

పాన్ వేడయ్యాక ఒకటిన్నర లీటర్ పాలు పోసి పావు లీటర్ అయ్యేవరకు కాగబెట్టాలి. అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి, పావుగంట కాగబెట్టాలి. తరువాత గిన్నెలో పోసి కాస్త చల్లారాక రెండు గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత ఆ పాలలో సీతాఫలం గుజ్జు, బాదం, పిస్తా తరుగు వేసి కలపాలి. అరగంట ఫ్రిజ్​లో పెడితే టేస్టీ బాసుంది రెడీ.

మోదక్

కావాల్సినవి :

సీతాఫలం గుజ్జు –  ఒక కప్పు, పాలు – ఒక కప్పు, పాల పొడి – రెండు కప్పులు, వెన్న – ఒక టేబుల్ స్పూన్, చక్కెర పొడి – పావు కప్పు

తయారీ :

ఒక పాన్​లో పాలు, పాల పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత అందులో వెన్న వేసి కలపాలి. చక్కెర పొడి, సీతాఫలం గుజ్జు కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమం ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేయాలి. వాటిని మోదక్​ల ఆకారంలో చేస్తే సీతాఫలం మోదక్​లు రెడీ. మోదక్​లా కాకపోతే మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు. అంతేకాదు.. కావాలంటే ఈ మిశ్రమంలో బాదం, పిస్తా తరుగులు వేసి కలపొచ్చు.