దశాబ్దాలుగా తేలని రెవెన్యూ , ఫారెస్ట్ గెట్టు పంచాది

దశాబ్దాలుగా తేలని రెవెన్యూ , ఫారెస్ట్ గెట్టు పంచాది
  • 6.40 లక్షల ఎకరాల్లో సరిహద్దు వివాదాలు
  • సర్కార్ నిర్లక్ష్యంతో పూర్తి కాని సర్వే 
  • అటవీ శాఖ అభ్యంతరాలతో చాలా గ్రామాల్లో పాస్​బుక్స్ పంపిణీకి బ్రేక్
  • వేర్వేరు రికార్డులతో సమసిపోని సమస్యలు
  • సమగ్ర భూసర్వేతోనే పరిష్కారమంటున్న రెవెన్యూ నిపుణులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య గెట్టు పంచాయితీలు ఏండ్లు గడుస్తున్నా తెగడం లేదు. అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారణ కావడం లేదు. రెండు శాఖల దగ్గర ఉన్న భూ రికార్డుల్లో తేడాలతోపాటు జాయింట్ సర్వే నిర్వహించకపోవడంతో వివాదాలు పరిష్కారం కావడం లేదు. సర్వే నిర్వహించకుండా తమ భూమి అంటే తమ భూమి అని రెండు శాఖలు పంతం పట్టడంతో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు వివాదాలు తేలకపోవడంతో సుమారు 6.60 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బీలో చేర్చడంతో పాస్ బుక్స్ రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనూ పట్టించుకోలే.. 

రాష్ట్రంలో మొత్తం 60.64 లక్షల ఎకరాల మేర అటవీశాఖ భూమి ఉందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాటిలో 53.60 లక్షల ఎకరాలు ఎలాంటి వివాదాలు లేకుండా, రికార్డులపరంగా క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయి. మరో 6,40,623 ఎకరాల భూముల్లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అందులో ఫారెస్ట్ భూములను ఆనుకొని రెవెన్యూ భూములే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివాదాలు ఉన్న భూములకు ఉమ్మడి ఏపీలో పట్టాదారు పాసు బుక్స్ జారీ అయినప్పటికీ.. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అభ్యంతరాల వల్ల కొత్త పాస్ బుక్స్ జారీ కాలేదు. దీంతో రైతులు సాగు చేసుకుంటున్న 6,40,623 ఎకరాల భూములను పార్ట్ బీలో చేర్చారు. ఈ భూములు ఎక్కువగా మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉన్నాయి. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా 90 వేల ఎకరాలు వివాదాల్లో ఉండగా, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 26 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 70 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 25 వేల ఎకరాలు, నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 50 వేల ఎకరాలు, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 32 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 35 వేల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్లు సమాచారం. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేసిన 74,075 ఎకరాల భూములను అటవీ శాఖ తమదిగా వాదిస్తోంది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు తదితర మండలాల పరిధిలో 60 వేల ఎకరాల  భూముల విషయంలో రెండు శాఖల మధ్య హద్దుల వివాదం నడుస్తోంది.

రైతులకు అందని సర్కార్ సాయం

అటవీ శాఖ అభ్యంతరాలతో పాస్ బుక్స్ రాకపోవడంతో రైతుబంధు, పీఎం కిసాన్ రావడం లేదని, ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా స్కీమ్ వర్తించడం లేదని రైతులు వాపోతున్నారు. పాస్ బుక్స్ లేని కారణంగా  బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని వారు తెలిపారు. పంట నమోదు కాకపోవడంతో పండించిన పంటను కూడా మార్కెట్లో అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమగ్ర సర్వేతోనే పరిష్కారం.. 

రాష్ట్రంలో అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి సమగ్ర భూ సర్వేనే పరిష్కారమని చాలా కాలంగా రెవెన్యూ సంఘాల నాయకులు, రెవెన్యూ చట్టాల నిపుణులు చెప్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం కేవలం రికార్డు టు రికార్డు పద్ధతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడం, అదే డేటాతో ధరణి పోర్టల్ ను రూపకల్పన చేసిన ఫలితంగా అనేక భూ వివాదాలు తలెత్తాయి. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలు కూడా పరిష్కారం కాలేదు. వాస్తవానికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడతామని 2014  ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత 2021 జూన్ 11 నుంచి సమగ్ర భూసర్వే ప్రారంభిస్తామని తెలిపారు. ఏడాదిన్నర గడిచినా సర్వేపై అతీగతీ లేదు.

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ రెవెన్యూ విలేజ్ పరిధిలోని 273, 192 సర్వే నంబర్లలో సుమారు పదివేల ఎకరాల భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్లలో అటవీ శాఖకు సుమారు 7,500 ఎకరాలు ఉండగా, మిగతా 2,500 ఎకరాలు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ భూములకు టీడీపీ, కాంగ్రెస్  ప్రభుత్వాల హయాంలో పలు దఫాలుగా 800 మంది రైతులకు పట్టాలు ఇచ్చారు. అయితే 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన టైమ్ లో అటవీ శాఖ అభ్యంతరం చెప్పడంతో సదరు రైతులకు కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా పార్ట్ బీలో చేర్చారు. ధరణిలో 800 మంది రైతుల పేర్లు, లావణీ పట్టా వివరాలు కనిపిస్తు న్నాయి. నాలుగేళ్లుగా రైతులు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పాస్ బుక్స్ ఇవ్వడం లేదు. 

రైతుల పట్టా భూములే కాదు.. ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూముల మధ్య కూడా పేచీ ఉంది. ములుగులో కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం గట్టమ్మ సమీపంలోని 573/2 సర్వే నంబరులో 53.31 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ భూమికి హద్దులు నిర్ణయించిన ఆఫీసర్లు భూమి చుట్టూ ట్రంచ్ కొట్టారు. పనులు మొదలు పెట్టేందుకు అక్టోబర్ 18న ఆర్అండ్ బీ అధికారులు జేసీబీ తీసుకురాగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫారెస్ట్ సిబ్బంది జేసీబీ టైర్లలో గాలి తీశారు. కలెక్టర్ ఆదేశాలను కూడా వారు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్ భూమి చదును పనులకు వెళ్లిన కాంట్రాక్టర్, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఫారెస్ట్ అధికారులు మరోసారి అడ్డుకున్నారు. సదరు కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ ఏఈపై పీఓఆర్ నెంబర్ 3878/77 చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.‌‌‌‌

హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల పరిధిలో 4,887 ఎకరాల మేర ఇనుపరాతి గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ గుట్టలు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటికి సమీపంలోనే ధర్మసాగర్ మండలం ముప్పారం శివారు 823, 824, 825, 842, 843, 844  సర్వే నంబర్లతోపాటు మరికొన్ని బై నంబర్లలో దాదాపు 120 ఎకరాల భూమి ఉంది. గతంలో ఆఫీసర్లు ఈ భూములకు పట్టా పాస్ బుక్స్ ఇష్యూ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో కొత్త పాస్ బుక్ లు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్పి ట్రెంచ్ కొడుతున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు  జాయింట్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. ఇరు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు.