
హైదరాబాద్: తెలంగాణలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళల గోస.. బీజేపీ భరోసా దీక్ష ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై ధర్మాసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ఒక సర్పంచ్ కే రక్షణ కరువైందంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి నిధులు కావాలని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో కూడా అక్కడి ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసిన విషయాన్ని డీకే అరుణ ప్రస్తావించారు. మహిళ అంటే తన కూతురు మాత్రమే కాదని, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థులు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా సీఎం స్పందించడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా ఆ సంఘటన వెనుక బీఆర్ఎస్ నాయకులు లేదా వాళ్ల పిల్లలు ఉంటున్నారని విమర్శించారు.