తోబుట్టువులతో తగాదాలొద్దు

తోబుట్టువులతో  తగాదాలొద్దు

అమ్మానాన్న తర్వాత  వాళ్లంత ప్రేమ చూపించేది, మంచీచెడూ చెప్పేది తోబుట్టువులే. చాలామందికి  మొదటి స్నేహితులు వీళ్లే. అంతేకాదు ఏదైనా విషయంలో గొడవపడడం, కొంచెం సేపటికి అన్నీ మర్చిపోయి మళ్లీ కలిసిపోవడం.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెలు, అక్కాచెల్లెళ్ల మధ్య  ఇలాంటివి మామూలే. 
ఈకాలం పిల్లలు ఫోన్​లో గేమ్స్​ ఆడుతూ, టీవీ చూస్తూ ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నారు. మరికొందరేమో జాబ్, కెరీర్​లో పడి వాళ్లని పలకరించడం లేదు. దాంతో వాళ్ల మధ్య అనురాగం, ఆప్యాయత కొరవడుతున్నాయి. ఎవరో ఒకరు చొరవ తీసుకుని మాట కలపకుంటే ఈ దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి వాళ్లతో మునపటిలా కలిసిపోయే ప్రయత్నం చేయాలి.  

ఒకరి వైపే ఉండొద్దు
తోబుట్టువుల మధ్య కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు అపార్థాలు చోటుచేసుకుంటాయి. దాంతో కొన్నిసార్లు గొడవలు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు   తమకు నచ్చిన వాళ్ల వైపే మాట్లాడతారు కొందరు. అలాచేస్తే అవతలివాళ్లకు  కోపం వస్తుంది. ఫలితం.. ఇద్దరి మధ్య మాటలు ఉండవు. అందుకని విషయం ఏదైనా ఇద్దరికీ నచ్చజెప్పాలి. దాంతో ఒకరి మీద ఒకరికి కోపం, ద్వేషం వంటివి రావు. 

సీరియస్​గా తీసుకోవద్దు
గతంలో బాధపెట్టారని, ఎప్పుడో ఏదో అన్నారని తోబుట్టువుని దూరం పెట్టొద్దు. తెలిసీ తెలియని వయసులో వాళ్లు అన్న మాటల్ని సీరియస్​గా తీసుకోవద్దు. వాళ్లతో అనుబంధాన్ని బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇదే విషయాన్ని వాళ్లతోనూ చెప్పాలి. అలాచేస్తే వాళ్లతో ఒకప్పటిలా ఉండడమే కాకుండా అందమైన జ్ఞాపకాల్ని సొంతం చేసుకోవచ్చు.  

ఎంకరేజ్ చేయాలి
కష్టం వచ్చినప్పుడు అయినవాళ్లతో చెప్పుకుంటే మనసు తేలికపడుతుంది అంటారు. అందుకని తోబుట్టువుల్లో ఎవరైనా చదువులో వెనకబడినప్పుడు, వాళ్ల ఆరోగ్యం బాగా లేనప్పుడు, జాబ్ కోల్పోయినప్పుడు వాళ్లలో ధైర్యం నింపాలి. ‘ఏం కాదు. మేమున్నాం’ అన్న భరోసా ఇవ్వాలి. ‘గట్టిగా ప్రయత్నించు. మంచి జాబ్ వస్తుంది’ అని ఎంకరేజ్ చేయాలి. 

టచ్​లో ఉండాలి
చదువు, జాబ్ వల్ల అందరూ వేరు వేరు ప్రాంతాల్లో ఉండాల్సి రావొచ్చు. దాంతో ఇంతకుముందులా రోజూ కలవడం, మాట్లాడడం కుదరదు. అలాంటప్పుడు  వారంలో ఒక రోజు టైం పెట్టుకని తోబుట్టువులకు ఫోన్ చేయాలి. ఫోన్ కాల్స్, వీడియోకాల్స్ అయితే ఇంకా బాగుంటుంది. 
వాళ్ల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. ఇలాచేస్తే వాళ్లతో అనుబంధం బలపడుతుంది.  

సంతోషాల్ని పంచుకోవాలి
జాబ్ రావడం, ప్రమోషన్, పెండ్లి ... ఇలా జీవితంలో ముఖ్యమైన  విషయాలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇంటిల్లిపాది ఒకచోట చేరితే మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ ఆనంద క్షణాల్ని తోబుట్టువులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది. తరచూ కలవడం కుదరనివాళ్లకు ఇలాంటి అకేషన్స్​ ‘గెట్​ టు గెదర్​లా’ పనికొస్తాయి.