కుర్చీలో కూర్చొని ఈజీగా..

కుర్చీలో కూర్చొని ఈజీగా..

ఆఫీస్​లో గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చొని పని చేస్తుంటారు చాలామంది. అలా ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తల, మెడ, భుజాలు, మోచేతులు, వెన్నెముక పైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో, నెమ్మదిగా నొప్పి మొదలవుతుంది. నొప్పి  నుంచి వెంటనే రిలీఫ్​ పొందడానికి కాఫీ, టీ తాగుతుంటారు. అయితే, ఈ సమస్యను అలానే వదిలేస్తే  ‘సర్వైకల్ స్పాండిలోసిస్‌‌‌‌‌‌‌‌’ సమస్యకి దారితీస్తుంది. అందుకని  కూర్చున్నచోటనే  టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న  ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌లు చేయాలి అంటోంది నోయిడాకు చెందిన యోగా ఎక్స్​పర్ట్‌‌‌‌‌‌‌‌ సరిత.

అవేంటంటే...

  •  తలను ఛాతి, భుజాలు, వీపు భాగాలకు ఆన్చుతూ గుండ్రంగా తిప్పాలి. అలా కుడివైపు, ఎడమవైపు చేయాలి. దీన్నే ‘నెక్‌‌‌‌‌‌‌‌ రొటేషన్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్​’ అంటారు. ఆ తర్వాత కొద్దిసేపు తలను కుడిభుజం, ఎడమభుజం మీదుగా అటుఇటు కదిలిస్తూ మెడను సాగదీయాలి.
  • మోచేతులు నొప్పి పెట్టకుండా ‘ఎల్బో ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌’ చేయాలి. ముందుగా చేతులతో భుజాల్ని పట్టుకోవాలి.   చేతుల్ని గుండ్రంగా తిప్పుతూ భుజాల్ని కదిలించాలి. చేతుల్ని ముందుకు చాచి మోచేతుల వరకు చేతిని ముందుకు, వెనక్కి అనాలి. తర్వాత మోచేతిని గుండ్రంగా తిప్పాలి. ఇలాచేస్తే మెడకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 
  • ‘షోల్డర్ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌’ చేస్తే భుజాల నొప్పి తగ్గుతుంది. ఈ ఎక్సర్​సైజ్ ఎలా చేయాలంటే... కుర్చీలో నిటారుగా కూర్చొని కొద్ది సేపు గట్టిగా గాలి పీల్చుతూ వదలాలి.  కుడి చేతిని ఎడమ భుజానికి సమానంగా ఎత్తాలి. ఎడమ చేతితో కుడి చేతిని పట్టుకొని భుజం, వీపును ఎడమ పక్కకు తిప్పాలి. ఇదే విధంగా రెండు పక్కలా చేయాలి.  
  • వెన్నునొప్పి పోవాలంటే...  కూర్చున్న కుర్చీ వెనక కుడి చేతిని పెట్టి, ఎడమ చేతితో కుడి తొడను పట్టుకోవాలి.  గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతూ, సాధ్యమైనంత వరకు వీపుని కుడి పక్కకు తిప్పాలి. అలా రెండు వైపులా చేయాలి.  

కూర్చున్న దగ్గరే మెడను పైకి, కిందకు, పక్కకు కదిలిస్తూ వ్యాయామం చేయొచ్చు. వీటిని ‘నెక్ ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌’ అంటారు. వీటిని ఎలా చేయాలంటే...  మెడను నిటారుగా ఉంచి, గాలి పీల్చుకొని తలను సాధ్యమైనంత వరకు వెనక్కి వంచాలి.  నెమ్మదిగా గాలి వదులుతూ తలను కిందికి వంచి ఛాతికి ఆనించాలి. తర్వాత తలను నిటారుగా ఉంచి భుజాలకు తాకేలా పక్కకు వంచాలి. ఇలా రెండు పక్కలా చేయాలి.