మనదేశంలోకి కాఫీ ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలుసా...

మనదేశంలోకి కాఫీ ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలుసా...

ఓ కప్పు కాఫీ తాగితే చాలు. ఫుల్ ఎనర్జిటిక్‌‌గా ఫీలవుతారు. అందుకే కమ్మని కాఫీ గొంతులో పడనిదే రోజు మొదలుపెట్టరు చాలామంది. కాఫీ కేవలం డ్రింక్ మాత్రమే కాదు. అదొక ఎమోషన్. ఎక్కడో ఇథియోపియాలో పుట్టిన కాఫీ మన చేతి వరకూ రావడం వెనుక బోలెడంత హిస్టరీ ఉంది. అసలు మనదేశంలోకి కాఫీ ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలుసా..

క్రీ.శ. తొమ్మిదో శతాబ్దంలో ఇథియోపియాలో కాల్డీ అనే గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకొని ఒక  కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పచ్చగడ్డి మేసేందుకు గొర్రెలను వదిలిపెట్టాడు. కాసేపటి తర్వాత చూస్తే గొర్రెలు ఆపకుండా గెంతుతూ కనిపించాయి.  అంతే కాదు ఆ రోజు రాత్రి అవి నిద్ర కూడా పోలేదు. దీంతో కాల్డీకి అనుమానం వచ్చింది. గొర్రెలు మేసిన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఏముందా? అని వెతికాడు. అక్కడ  ఎర్రగా కొన్ని బెర్రీస్ కనిపించాయి. వాటిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అంతే.. అంతా కొత్తగా అనిపించింది. ఈ గింజల్లో ఏదో మ్యాజిక్ ఉందని.. వాటిని తీసుకెళ్లి అక్కడ ఉండే సాధువులకు ఇచ్చాడు. వాళ్లు ఆ గింజలతో ఒక డ్రింక్ తయారు చేశారు. అదే మనిషి మొదటిసారి తయారు చేసిన కాఫీ.

మన దేశానికి ఇలా..

అలా మొదలైన కాఫీ తర్వాతి రోజుల్లో విపరీతంగా పాపులర్ అయింది. లగ్జరీకి, స్టేటస్‌‌కు సింబల్‌‌గా మారింది. కాఫీ గింజలను పండించేందుకు అప్పట్లో అందరికీ అనుమతి ఉండేది కాదు. దాంతో కాఫీ గింజలను దొంగచాటుగా పండించడం, స్మగ్లింగ్ చేయడం లాంటివి చేసేవాళ్లు. అలా 17 వ శతాబ్దం నాటికి కాఫీ దొంగచాటుగా మనదేశానికి చేరుకుంది. చిక్‌‌మగళూరుకి చెందిన బాబా బుదాన్ అనే వ్యక్తి హజ్ యాత్ర నుంచి తిరిగి వస్తూ ఎవరికీ తెలియకుండా ఏడు ‘అరబికా’ కాఫీ గింజలను ఇండియాకి తీసుకొచ్చాడు. వాటిని తన పెరట్లో నాటి కాఫీ మొక్కలు పెంచాడు. అలా చిక్‌‌మగళూరు.. మనదేశంలో కాఫీకి పుట్టిల్లు అయిందన్న మాట. ఇక ఆ తర్వాతి కథ తెలిసిందే. 

బ్రిటిష్ వాళ్లు వచ్చాక దేశంలో కాఫీ వాడకం ఇంకా పెరిగింది. ఇక్కడి వాతావరణం కాఫీ పంటకు అనుకూలంగా ఉండడంతో మైసూర్ రాజుని ఒప్పించి మొదటిసారి మైసూర్‌‌‌‌లో కాఫీ పంట వేశారు. అక్కడ పండే కాఫీ గింజలను విదేశాలకు ఎక్స్‌‌పోర్ట్ చేసేవాళ్లు. అలా దేశంలో కాఫీ ప్లాంటేషన్స్ పెరుగుతూ పోయాయి.  దాంతో రాజులు మాత్రమే తాగే కాఫీ సామాన్యుల వరకూ చేరింది. ఆ తర్వాత1942 లో ‘కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటైంది. ప్రస్తుతం మనదేశంలో అరబికా, రొబస్టా, లిబరికా అనే మూడు రకాల కాఫీ బీన్స్ ఎక్కువగా పండుతాయి. సుమారు వందకు పైగా దేశాలకు మనదేశం నుంచి కాఫీ ఎగుమతి అవుతోంది.

ఎన్నో వెరైటీలు

ప్రపంచవ్యాప్తంగా కాఫీలో ఎన్నో రకాలున్నాయి. ఎస్‌‌ప్రెస్సో, కపచ్చినో, లాటీ, ఐరిష్ కాఫీ, అమెరికనో, ఫ్లాట్‌‌వైట్, మాకియాటో, మోచా, వియన్నా.. ఇలా కాఫీలో యాభైకి పైగా  వెరైటీలున్నాయి. ప్రతీ కాఫీకి ప్రత్యేకమైన మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మనదేశంలో కూడా కొన్ని కాఫీ ఫ్లేవర్స్ పుట్టాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో పుట్టిన ఫిల్టర్ కాఫీ, డిగ్రీ కాఫీ, సుక్కు కాఫీ, బెల్లా కాఫీల గురించి చాలామందికి తెలియదు.

తమిళనాడు ‘కాపీ’లు

 దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో కాఫీని ‘కాపీ’ అని కూడా అంటుంటారు. ముఖ్యంగా ఇక్కడి ‘ఫిల్టర్ కాపీ’ చాలా ఫేమస్. కాఫీ బీన్స్‌‌ను దోరగా వేగించి, రోట్లో దంచి, మెత్తటి కాఫీ పౌడర్‌‌‌‌ తయారు చేస్తారు. దీన్ని ఒక చిల్లుల స్టాండ్‌‌పై పెట్టి  దానిపై మరుగుతున్న నీటిని పోస్తారు. అలా సేకరించిన డికాషన్‌‌లో వేడివేడి పాలు కలిపితే ఫిల్టర్ కాఫీ రెడీ. ఇప్పుడు ఇంత ప్రాసెస్ లేకుండానే ఫిల్టర్ కాఫీ తయారుచేసే పద్ధతులు వచ్చాయి.

దీంతో పాటు ‘డిగ్రీ కాఫీ’ అనే పేరు కూడా చాలామంది వినే ఉంటారు.  1950లో తమిళనాడులోని కుంభకోణంలో పంచమి అయ్యర్ అనే వ్యక్తి దీన్ని మొదలుపెట్టాడు. అయ్యర్ తన హోటల్ కస్టమర్లకు  స్వచ్ఛమైన పాలతో చేసిన కాఫీనే ఇచ్చేవాడు. పాల నాణ్యతను చెక్ చేయడానికి లాక్టోమీటర్ కూడా వాడే వాడు. అప్పట్లో స్వచ్ఛమైన పాలను డిగ్రీ పాలు అనేవాళ్లు. అలా ఆ కాఫీ కాస్తా ‘కుంభకోణం డిగ్రీ కాఫీ’ అయింది. ఇకవీటితో పాటు పాలు కలపకుండా బెల్లంతో చేసే ‘బెల్లా కాపీ’, శొంఠితో చేసే ‘సుక్కు కాపీ’ కూడా దక్షిణాదిన చాలా ఫేమస్.

žకాఫీ ఫ్యాక్ట్స్‌‌

  •     కాఫీ బీన్స్ నిజానికి బీన్స్ జాతికి చెందినవి కావు. కాఫీ గింజల్ని కాఫీ బెర్రీస్ పండ్ల నుంచి తీస్తారు. ఈ బెర్రీస్ తియ్యటి రుచితో ఉంటాయి. 
  •     ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ధర నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుంది.
  •     అప్పట్లో చాలా దేశాలు, రాజ్యాలు కాఫీని  బ్యాన్ చేయాలని చూశాయి. కానీ జరగలేదు. ఒట్టోమన్ రాజ్యంలో కాఫీ తాగితే మరణ శిక్ష కూడా విధించేవాళ్లు. 
  •     2019లో అతిపెద్ద కాఫీ కప్‌‌ను తయారు చేసి అందులో 20 వేల లీటర్ల కాఫీ నింపారు. అది గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కింది.
  •     కొన్ని స్టడీస్​ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకి సుమారు 200 కోట్ల కాఫీ కప్‌‌లు ఖాళీ అవుతున్నాయి. 
  •     కాఫీ అన్న పదం  ‘ఖహ్వాహ్’ అనే అరబిక్ పదం నుంచి పుట్టింది. ‘ఖహ్వాహ్’ అంటే అరబిక్‌‌లో ‘వైన్’ అని అర్థం.