ఒక్కరోజు రాజధాని 

ఒక్కరోజు రాజధాని 

మనదేశానికి కేవలం ఒక్కరోజు రాజధానిగా ఉన్న నగరమేదో తెలుసా? ఆ ఘనత ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​(ఇప్పటి ప్రయాగ్​రాజ్​)ది. ఆ సంగతేంటంటే.. 1772 నుంచి కలకత్తా(ఇప్పటి కోల్​కతా) రాజధానిగా ఇండియాను ఈస్ట్​ ఇండియా కంపెనీ పాలించేది. అయితే 1857లో మీరట్​ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీన్నే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెప్తారు. ఈ ఉద్యమాన్ని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్​ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్​ ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంది. దీనిపై 1858లో క్వీన్​ విక్టోరియా ఆర్డర్స్​తో​ ఉన్న లెటర్​ అప్పటి వైస్రాయ్​​ జనరల్​ లార్డ్​ క్యానింగ్​కు చేరింది. లెటర్​ అందే సమయానికి ఆయన అప్పటి నార్త్​వెస్ట్రన్​ ప్రావిన్స్​(ఇప్పటి ఉత్తరప్రదేశ్​) రాజధాని అయిన అలహాబాద్​లో ఉన్నాడు. వెంటనే ఆయన అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో అక్కడి మింటో పార్క్​లో సమావేశం ఏర్పాటుచేశాడు. క్వీన్​ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్​ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్​ గవర్నమెంట్​కు ట్రాన్స్​ఫర్​ చేస్తున్నట్లు ఆమోదం తెలిపాడు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్​ను ఇండియా రాజధానిగా ప్రకటించాడు.  అలా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్​ చరిత్రకెక్కింది.

వెయ్యి కేజీల ప్లాస్టిక్​తో..​

‘క్విట్​ ఇండియా’ ఉద్యమానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ‘స్వచ్ఛభారత్​’ మిషన్​లో భాగంగా వెయ్యి కేజీల ప్లాస్టిక్​ వేస్ట్​తో ఈ విగ్రహం తయారుచేశారు. 20 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం బరువు 1,150 కేజీలు. నోయిడాలోని సెక్టార్​ 137 ఏరియాలో విగ్రహాన్ని ఈ ఏడాది ఆగస్ట్​ 9న ఆవిష్కరించారు.