కుక్కల సూసైడ్‌ స్పాట్‌ !

కుక్కల సూసైడ్‌ స్పాట్‌ !

స్కాట్లాండ్ లోని గ్లౌస్గౌవ్‌ నగరానికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓవర్‌ టౌన్‌ కోట. రెండు వందల ఏళ్ల క్రితం ఓ వ్యాపారి ఈ కోటను కట్టించాడు. అతను చనిపోయాక ఈ కోటను ప్రసూతి ఆస్పత్రిగా ఉపయోగించారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర రాజ్యాలు స్థావరంగా ఉపయోగించుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం టూరిస్ట్‌ స్పాట్ గా వెలుగొందుతోంది. సినిమా షూటింగ్ లతో ఇక్కడ కోలాహలం నెలకొంటుంది. అయితే ఈ కోటకు దగ్గర్లోని బ్రిడ్జిని చూస్తే ప్రజలు భయంతో వణికిపోతారు.

భయం.. భయం…

కోటను ఆనుకుని ప్రవహించే నదీపాయపై 50 అడుగుల ఎత్తులో ఓ బ్రిడ్జిని కట్టించారు. ఓవర్‌టౌన్‌ బ్రిడ్జిగా దానికి పేరు. అయితే 1950 నుంచి ఈ బ్రిడ్జికి ‘డాగ్‌ సూసైడ్‌ స్పాట్‌’గా పేరు పడిపోయింది. దశాబ్ద కాలంలో 50కి పైగా కుక్కలు చనిపోవడమే అందుకు కారణం. ఆతర్వాత ‘కుక్కలకు అనుమతి లేదు’ అనే బోర్డును అధికారులు తగిలించారు. అయినా కూడా అటుగా కొందరు కుక్కలతో వెళ్లడం.. అవి పిచ్చెక్కినట్లు బ్రిడ్జి నుంచి దూకి చనిపోవడం జరుగుతూవస్తోంది. విచిత్రం ఏంటంటే బ్రిడ్జికి ఒకవైపు మాత్రమే అవి దూకుతుండటం. పరిశోధకులు ఎంత జుట్టు పీక్కున్నా ఈ విషయంలో ఈ మిస్టరీని ఛేదిం చలేకపోయారు. చుట్టుపక్కల ప్రజలు మాత్రం అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని, అందుకే కుక్కలు బలవన్మరణానికి పాల్పడుతున్నాయని నమ్ముతున్నారు.

కారణం అదేనా…?

డేవిడ్‌ సాండ్ స్‌ అనే మానసిక నిపుణుడు 2005లో ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన వెంట ఉన్నకుక్క కూడా బ్రిడ్జి మీద నుంచి దూకేసింది. అదృష్టవశాత్తూ చెట్ల కొమ్మల్లో చిక్కుకోవడంతోఅది ప్రాణాలతో బయటపడింది. ‘బ్రిడ్జి మీదకు వెళ్లగానే నాక్కూడా చిరాకుగా అనిపించింది. ఒళ్లంతా మండిపోయింది. బహుశా ఆ చుట్టుపక్కల ‘ఫ్రీక్వెన్సీ’ ఎక్కువగా ఉండొచ్చు. కుక్కలు ఫ్రీక్వెన్సీని సులువుగా గుర్తిస్తాయి. ఒకవేళ ఎక్కువైతే అవి తట్టుకోలేవు. అందుకే అవి అలా ప్రవర్తిస్తున్నాయేమో’అని సాండ్స్‌ చెబుతున్నాడు. అయితే ఇప్పటికీ ఈ మిస్టరీ అలానే కొనసాగుతోంది.