TS-iPASS ద్వారా కేవలం 16 రోజుల్లో అనుమతులు

TS-iPASS ద్వారా కేవలం 16 రోజుల్లో అనుమతులు

హైదరాబాద్​ : ఎంఎస్​ఎంఈ సహా ఎలాంటి రకమైన బిజినెస్​కు అయినా పూర్తి అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర మున్సిపల్​, ఐటీశాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. టీఎస్​ ఐపాస్, 24 గంటలు కరెంటు, క్వాలిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇతర రాష్ట్రాలవాళ్లు కూడా తెలంగాణవైపు చూస్తున్నారని అన్నారు. ఫెడరేషన్​ ఆఫ్ ​తెలంగాణ చాంబర్స్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ​ (ఎఫ్​టీసీసీఐ) హైదరాబాద్​లో సోమవారం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడకముందు నీళ్లు, కరెంటు, రోడ్ల వంటి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లేక ఎంఎస్​ఎంఈలు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయని అన్నారు.  

‘‘ఇండస్ట్రీలకు టీఎస్​ఐపాస్​ ద్వారా కేవలం 16 రోజుల్లో అనుమతులు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు కరెంటు కోతలు లేవు. నీళ్ల బాధలు లేవు. పరిశ్రమలు పెడితే లంచాల కోసం వేధింపులు లేవు. శాంతిభద్రత సమస్యలు లేనేలేవు.  అందుకే ఒకసారి పెట్టుబడులను పెట్టిన వాళ్లు కూడా మరోసారి పెడుతున్నారు. ఇలాంటి పెట్టుబడులు 24 శాతం ఉన్నాయి. రాష్ట్రమంతటా ఫుడ్​ ప్రాసెసింగ్​ సెక్టార్​ను ఎంకరేజ్​ చేయడానికి కొత్తగా స్పెషల్ ఫుడ్​ ప్రాసెస్​ జోన్లు కూడా పెడుతున్నాం. జిల్లాలకూ పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోనే పారిశ్రామికంగా టాప్​–4లో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు, కర్ణాటకతో మన రాష్ట్రం పోటీపడుతోంది. డెయిరీ, వ్యవసాయం, చేపల పెంపకం, మాంసం, నూనెగింజల సాగును ఎంకరేజ్​ చేస్తున్నాం”అని ఆయన వివరించారు. తమతమ వ్యాపారాల్లో సత్తా చాటిన 19 ఎంఎస్​ఎంఈలకు మంత్రి ఈ సందర్భంగా అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఎఫ్​టీసీసీఐ ప్రెసిడెంట్​ భాస్కర్​ రెడ్డి, తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేశ్ రంజన్​ పాల్గొన్నారు.