అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసన ప్రక్రియ సెనెట్‌లో వీగిపోయింది. అధికార దుర్వినియోగం, సభ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై ఓటింగ్ నిర్వహించిన సెనెట్.. ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌పై దర్యాప్తు చేపట్టాలని ఉక్రెయిన్‌ను ట్రంప్ ఒత్తిడి చేశారని, అందుకు ప్రతిఫలంగా మిలటరీ సాయం చేస్తానని మాట ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నిర్వహించిన ఓటింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 52 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 48 ఓట్లు పడ్డాయి. దాంతో ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకున్నారు. మరోవైపు సభను అడ్డుకున్నారన్న ఆరోపణల్లోనూ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 53 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 47 ఓట్లు పడ్డాయి. కాగా.. అధికార దుర్వినియోగం ఆరోపణపై జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్ సెనెటర్ మిట్ రోమ్నీ.. సభను అడ్డుకున్నారన్న ఆరోపణలో మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా ఓటేశారు. ఈ రెండు ఆరోపణల్లో ఏ ఒక్క దానికైనా సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే.. ట్రంప్ తన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చేది.
