అమెరికా రక్షణకు స్వర్ణ కవచం .. గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్

అమెరికా రక్షణకు స్వర్ణ కవచం .. గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్
  • స్పేస్​లో సైతం మిసైల్స్, లేజర్ వెపన్స్ మోహరిస్తామని వెల్లడి
  • ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటు
  • 175 బిలియన్ డాలర్ల ఖర్చు
  • 2029 వరకు అందుబాటులోకి..

వాషింగ్టన్: అమెరికాను మిసైల్స్, డ్రోన్స్, రాకెట్ దాడుల నుంచి కాపాడేందుకు ‘గోల్డెన్ డోమ్’ పేరుతో శత్రు దుర్భేద్యమైన అధునాతన క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మొత్తం 175 బిలియన్ డాలర్ల (రూ.15 లక్షల కోట్లు)  వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును అమెరికా రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘లాఖీడ్ మార్టిన్’కు అప్పగించినట్టు ఆయన మంగళవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి వెల్లడించారు. మొదటి దశలో ఈ ప్రాజెక్టుకు 25 బిలియన్ డాలర్లు (రూ.2.13 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్టు తెలిపారు.

 ప్రపంచంలో ఏ మూలన మిసైల్ పైకి లేచినా, తక్షణమే పసిగట్టడంతోపాటు.. అది అమెరికా వైపు దూసుకొచ్చి, టార్గెట్ ను ఢీకొట్టేలోపే మార్గమధ్యంలోనే అడ్డుకునేలా ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వందలాది శాటిలైట్లను అంతరిక్షానికి పంపనున్నామని తెలిపారు. అమెరికాకు మిసైల్ దాడులే అతిపెద్ద ప్రమాదమని, 2029 జనవరి కల్లా ఈ గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే, వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు దీర్ఘకాలికంగా అయ్యే ఖర్చు 500 బిలియన్ డాలర్లు (రూ. 42.79 లక్షల కోట్లు) 
దాటిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.

అంతరిక్షంలోకి మిసైల్స్, లేజర్ వెపన్స్.. 

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న గోల్డెన్ డోమ్ కోసం ఏకంగా అంతరిక్షంలో సైతం ఇంటర్ సెప్టర్ మిసైల్స్ ను, లేజర్ వెపన్స్ ను మోహరించనున్నారు. అంతరిక్షం నుంచి జరిగే దాడులనూ అడ్డుకునేలా దీనిని సిద్ధం చేయనున్నారు. శత్రు మిసైళ్లు, డ్రోన్లను గుర్తించి, ట్రాక్ చేసి, అడ్డుకునేందుకు వీలుగా ఇటు భూమిపై, అటు అంతరిక్షంలోనూ నిఘా, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.

ఎలా పని చేస్తుందంటే.. 

స్పేస్ బేస్డ్ సెన్సర్లు: ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన మిసైల్ లాంచ్ అయినా ఇవి వెంటనే గుర్తిస్తాయి. 
ఇంటర్ సెప్టర్ నెట్ వర్క్స్: భూమిపై, అంతరిక్షంలో మోహరించిన మిసైల్స్ మార్గమధ్యంలోనే శత్రు మిసైళ్లను పేల్చేస్తాయి.
ఏఐ కమాండ్ సిస్టమ్స్: డిఫెన్స్ నెట్ వర్క్ అంతటా డేటాను వేగంగా విశ్లేషించి, టార్గెట్లను కచ్చితత్వంతో అడ్డుకునేలా పని చేస్తాయి.