లక్కీ డ్రా తీసి వదిలేసిన్రు! .. ‘డబుల్’ ఇండ్లు ఓపెన్ చేసినా ఎవ్వరికీ ఇయ్యలే

లక్కీ డ్రా తీసి వదిలేసిన్రు! .. ‘డబుల్’ ఇండ్లు ఓపెన్ చేసినా ఎవ్వరికీ ఇయ్యలే
  • పట్టాలు పంపిణీ చేసి ఇంటి స్థలాలు చూపించని ఆఫీసర్లు
  • ఇండ్లు, ఇంటి స్థలాలపై క్లారిటీ ఇవ్వాలంటున్న లబ్ధిదారులు

గద్వాల, వెలుగు: డబుల్  బెడ్రూమ్  ఇండ్ల కోసం లక్కీ డ్రా తీసిన ఆఫీసర్లు వాటిని ఎవరికీ ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టారు. అలాగే ఎన్నికల ముందు హడావుడిగా ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చినా, ఆ జాగ ఎక్కడ ఉందో చూపించకపోవడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రాంతంలో గుట్టలు, రాళ్లు, వాగులు ఉన్నాయి. దీనిపై ఎవరిని అడగాలో.. ఎక్కడికి వెళ్లాలో.. తెలియక లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,275  డబుల్  బెడ్రూమ్  ఇండ్లు కట్టగా, 8 నెలల కింద 770 ఇండ్లకు లక్కీ డ్రా తీశారు. గతంలో ఇచ్చిన పట్టాలు గుంజుకొని తమకు అన్యాయం చేశారని కొందరు కోర్టుకు వెళ్లడంతో వారికోసం 505 ఇండ్లు పక్కన పెట్టారు. ఎన్నికల వరకు పనులు కంప్లీట్ కాకపోవడంతో వాటిని కేటాయించలేదు. ఎన్నికల కోడ్  వస్తుందనే హడావుడిలో డబుల్  బెడ్రూమ్  ఇండ్లు పంపిణీ కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఇప్పటివరకు ఆఫీసర్లు దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు.

ఒక్క ఇల్లు ఇయ్యలే..

బీఆర్ఎస్  తొమ్మిదేండ్ల పాలనలో గద్వాల జిల్లాలో ఒక్క డబుల్  బెడ్రూమ్  ఇల్లు కూడా ఇవ్వలేదు. గత ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్  గద్వాల నియోజకవర్గానికి 2,500 ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వీటి కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, ఎన్నికల ముందు ఎంక్వైరీ చేసి 4 వేల మందిని అర్హులని తేల్చారు. అయితే నియోజకవర్గంలో 1,275 ఇండ్లు మాత్రమే ఉండడం, అందులో కోర్టుకు వెళ్లిన వారికి 505 ఇండ్లు పక్కన పెట్టి మిగిలిన వాటికి లక్కీ డ్రా తీశారు. 8 నెలల కింద లక్కీ డ్రా నిర్వహించినా ఇప్పటివరకు ఇండ్లు కేటాయించలేదు. ఎన్నికల కోడ్  కొన్ని గంటల్లో వస్తుందనగా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హడావుడిగా డబుల్  ఇండ్లను ఓపెన్ చేశారు. ఇండ్లు ఓపెన్  చేస్తే లబ్ధిదారులను తీసుకెళ్లి గృహప్రవేశం చేయించాలి. కానీ ఆఫీసర్లు, ఎమ్మెల్యే ఎవరికీ చెప్పకుండా అరగంటలో ఈ తతంగం కానిచ్చేశారు. డ్రాలో ఇండ్లు వచ్చిన వారికి ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పేపర్ల పైనే ప్లాట్లు..

లే అవుట్​ లేకుండా ఇంటి స్థలాలు మంజూరు చేస్తూ పట్టాలు అందించడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల సమీపంలోని సర్వే నంబర్ 194 లో 70 ఎకరాల అసైన్డ్  భూమి ఉంది. అందులో 8 ఎకరాల వరకు గుట్టలున్నాయి. 1975లో అసైన్డ్  భూమిలో గుట్టలు తీసేసి 62 ఎకరాలను 40 మంది రైతులకు పట్టాలిచ్చారు. ఇందులో 36 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని, 75 గజాల చొప్పున 1,109 మందికి ప్లాట్లు ఇచ్చేందుకు ఎన్నికల ముందు పేపర్లపై ప్లాన్  రెడీ చేశారు. కొందరికి ప్లాట్లకు సంబంధించిన పట్టాలు కూడా అందించారు. అయితే ఆ స్థలం ఎక్కడుందో ఇప్పటికీ లబ్ధిదారులకు తెలియకపోవడం గమనార్హం.

నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..

డబుల్  బెడ్రూమ్  ఇండ్లు, ప్లాట్ల పంపిణీపై ఆఫీసర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టాల్లో లబ్ధిదారులకు నంబర్  అలాట్​ చేశాం. ఇండ్ల పట్టాలు కూడా కొందరికి పంపిణీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటాం.

నరేందర్, తహసీల్దార్, గద్వాల