
- ఇప్పటికే ఒక ప్లాంట్‌కి గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడు ఇంకోదానికి ప్రపోజల్స్
- విభజన చట్టం ప్రకారం కేంద్రం నిర్మించి ఇస్తామంటే చప్పుడు చేయని రాష్ట్రం
- బొగ్గు కొరతతో అనేక థర్మల్ ప్లాంట్లలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో గోల్మాల్ జరుగుతున్నది. రాష్ట్ర సర్కారు ఒక్కో సందర్భంలో ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎవరి కోసం నిర్మిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మించి ఇస్తామని లెటర్ రాస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నది. ఇప్పటికే జైపూర్‌లో కొత్తగా తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణ టెండరు రూ.6,500 కోట్లతో భెల్ కు ఖరారైంది. ఈ విద్యుత్ కొనుగోలుకు డిస్కంల నుంచి సూత్రప్రాయ ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇంకో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టం ప్రకారం రావాల్సిన దానిని వద్దంటూ.. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లకు అనుమతులివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం జెన్కోతో కాకుండా.. బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాల్సిన సింగరేణికి ప్లాంట్ల నిర్మాణానికి ఓకే చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యం దృష్ట్యా దేశమంతా సోలార్, హైడల్ పవర్ ఉత్పత్తిపై దృష్టి పెడుతుండగా... అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం ఎవరికో మేలు చేసేందుకేనన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వాళ్లు సింగరేణికి చెందిన సంఘాల్లో కీలకంగా ఉండడం, వారి కనుసన్నల్లోనే ఈ నిర్ణయాలన్నీ జరుగుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
విభజన చట్టంలో ఉన్న విద్యుత్ ప్లాంట్‌కు నో
వాస్తవానికి ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు అవసరం లేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించి బూడిద చేయడం వల్ల విపరీతంగా కాలుష్యం వెలువడి ప్రజారోగ్యం గుల్లవడమే కాకుండా పర్యావరణం సైతం నాశనమవుతుంది. దేశంలో ఇప్పటికే పలు థర్మల్ కేంద్రాలు బొగ్గు లేక మూతపడుతున్నాయి. అయితే, విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాల్సి ఉంది. అందులో భాగంగా తొలి విడతగా ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో రెండు ప్లాంట్లను నిర్మించింది. మొదటి దశలో 1,600 మెగావాట్లు (800 మెగావాట్లతో కూడిన 2 యూనిట్లు) ఎన్టీపీసీ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విధానంలో నిర్మించింది.
రెండో దశలో 2,400 మెగావాట్ల (800 మెగావాట్లతో కూడిన 3 యూనిట్లు) ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర సర్కారుకు కేంద్రం లెటర్ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కేంద్రం కట్టించి ఇస్తామని చె బుతున్నా ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయడం లేదు. అలాగే థర్మల్ కు బదులుగా సోలార్ ప్లాంట్ కట్టివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా అందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన దానిపై మౌనం పాటిస్తూ.. ఇటు సింగరేణి ఆధ్వర్యంలో మరో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది.
రాష్ట్రం సొంతంగా ఒక్క సోలార్ ప్లాంటూ పెట్టలే
వేల కోట్ల రూపాయలతో భద్రాద్రి, యాదాద్రితో పాటు సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్లను నిర్మిస్తున్న రాష్ట్ర సర్కారు అతి తక్కువ ధరకు లభించే ఒక్క సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా సొంతంగా నిర్మించలేదు. సోలార్ విద్యుత్ అతి చౌకగా దేశంలో యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 కే వస్తోంది. మరోవైపు సోలార్ ప్లాంట్‌తో ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రూ.10 వేల కోట్లు, యాదాద్రికి రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఇప్పుడు సింగరేణి థర్మల్ ప్లాంట్లకూ అప్పులే చేసింది. యదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటును రాబోయే 27 సంవత్సరాల పాటు తెలంగాణ డిస్కంలు ఎంత రేటుకైనా కొని తీరాల్సిందేనని ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. సింగరేణి ప్లాంట్ కు అదే జరగబోతున్నది. దీంతో డిస్కంలను నష్టాల నుంచి కాపాడాలంటే ప్రజల నుంచి వసూలు చేసే కరెంట్ బిల్లులు ఇష్టారీతిన పెంచాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏడాదిన్నరలో యాదాద్రి నుంచి 4 వేల మెగావాట్లు
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను మొదలుపెట్టింది. టార్గెట్ ప్రకారం 2020 అక్టోబర్ లోనే రెండు ప్లాంట్లలో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. అయితే, పనుల ఆలస్యంతో ప్లాంట్ నిర్మాణం పూర్తి కాలేదు. ఏడాదిన్నరలో అంటే వచ్చే సంవత్సరం చివరలోగా నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి యాదాద్రిలో ప్రారంభమవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో కరెంట్ దాదాపు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఈ సందర్భంలో కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ అవసరం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం సింగరేణితో ఇంకో థర్మల్ ప్లాంట్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నది. రాష్ట్రంలో రోజు యావరేజ్ గా 10 వేల నుంచి 12 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. మార్చిలో మాత్రమే 15,487 మెగావాట్ల డిమాండ్ ఒకసారి వచ్చింది.
థర్మల్ కరెంట్ రేటు ఎక్కువ.. ఆ భారం ఎవరిపై?
ఒకవైపు కేంద్రం సోలార్, హైడల్ పవర్ ను ఎంకరేజ్ చేస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4 లక్షల మెగావాట్లుగా ఉన్నది. ఇందులో ఒక్క థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమే 2.05 లక్షల మెగావాట్లు. అయితే ఇటీవల కాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి కావడం లేదు. బొగ్గు కొరత ఒకటైతే.. రెండోది థర్మల్ విద్యుత్ యూనిట్ రేటు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ యూనిట్‌కు రూ.10 దాకా అవుతోంది. రెండేండ్లలో ఇది మరింత పెరిగే చాన్స్ ఉంది. పెరిగే ఆ భారమంతా వినియోగదారుల మీదే పడుతుంది. అయితే, కేంద్రమే రామగుండంలోని ఎన్టీపీసీలో నిర్మించి ఇస్తే..రాష్ట్ర సర్కారుకు తక్కువ ధరకు కరెంట్ వస్తుంది. అదే సింగరేణితో చేపడితే అందు కోసం అప్పు చేయాలి. ఫలితంగా ప్లాంట్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చేసరికి కరెంట్ కొనుగోలు రేటు కూడా పెరిగే అవకాశం ఉంది.