
పెద్దల మాట చద్దన్నం మూట – అనే నానుడి మన సమాజంలో వాడుకలో ఉంది. చద్ది అన్నం అంటే... ముందు రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున తినేది అని అర్థం. చద్దన్నం తింటే కనుక మళ్లీ సాయంత్రం వరకు ఆకలి అనేదే ఉండదు. అంటే తిన్న ఆహారం శరీరానికి కనీసం పది గంటలసేపు శక్తినిస్తుంది. అలాగే పెద్దల మాట కూడా. నైతిక విలువలనే పోషకాలు కలది.
జీవితానుభవం రంగరించి పెద్దలు చెప్తున్న మాటలను వేదవాక్కులా ఆచరిస్తే... ఆ మాటలు ఆదర్శ జీవనానికి హేతువు కాగలవు. మానవ మనుగడకు శక్తినిచ్చి తోడ్పడగలవు. సత్యం వద, ధర్మం చర, సత్యమేవ జయతే... ఇటువంటి ఉపనిషద్వాక్యాలు నేటికీ మానవ వికాసానికి ఔషధంలా పనిచేస్తున్నాయి. అందుకే ‘పెద్దల మాట పెన్నిధి మూట’ అని కూడా అంటారు. పెన్నిధి అంటే పెద్ద నిధి అని అర్థం. నిధి అంటే సంపదలు అనుకోకూడదు. నిధి అంటే తరగనిది. అందుకే పెద్దల మాట పెన్నిధి మూట లేదా చద్ది మూట అని అర్థం చేసుకోవాలి.
‘కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు’ అని పెద్దలు చెప్పిన మాటకు పిల్లి, గద్ద కథ ఒక మంచి ఉదాహరణ. భాగీరథి నదీ తీరంలో జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉంది. దానికి చూపులేదు. వృద్ధాప్యానికి అంధత్వం కూడా తోడవ్వటంతో, బయట తిరిగి ఆహారాన్ని సంపాదించుకోలేకపోయేది. ఆ చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు దాని మీద జాలిపడి అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగం జరద్గవానికి పెట్టేవి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ద్వీపకర్ణుడు అనే ఒక పిల్లి... పక్షి పిల్లల్ని తినడానికి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. దానిని చూసిన పక్షి పిల్లలు భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపులు విన్న గద్దకు ఎవరో వచ్చారని అర్థమైంది.
‘ఎవరది?’ అని గట్టిగా గద్దించింది. అప్పుడు పిల్లి... కపట నాటకం ఆడకపోతే తన ప్రాణానికి ముప్పు తప్పదని భావించి, ‘నేను ద్వీపకర్ణుడు అనే పిల్లిని, చాంద్రాయణ వ్రతం చేస్తున్నా. అందువల్ల మాంసం ముట్టను. నువ్వు సకల శాస్త్రాలు తెలిసినదానివని మిగిలిన జంతువులు అనుకోవడం విన్నా. నీ సేవ చేస్తూ, నీ నుంచి మంచి మాటలు వింటూ, పుణ్యం సంపాదించుకుందామని ఇక్కడకు వచ్చా’ అని ఎంతో వినయంగా పలికింది. దాని మాటలను జరద్గవం నమ్మింది. ఆ రోజు నుంచి పిల్లి ప్రతిరోజు గద్ద దగ్గరకు వచ్చి, కొద్దిసేపు మంచి మాటలు వినటం మొదలుపెట్టింది. తగిన సమయం చూసి పక్షి పిల్లలను తినేసి, వాటి ఎముకలను గద్ద ఉన్న చెట్టు తొర్రలో పడేసేది. పక్షులు తమ పిల్లలు కనపడటం లేదని గద్ద ఉన్న చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ ఎముకలు కనిపించాయి. గద్ద తమ పిల్లల్ని తినేసి ఉంటుందని భావించి, పక్షులు గద్దను గోళ్లతో రక్కి చంపేశాయి.
గద్ద కొత్తగా వచ్చిన పిల్లిని నమ్మి తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. అందువల్లే రాజకీయాల్లో, వ్యాపారంలో కానీ, మన ఇంటికి వచ్చిన కొత్తవారిని నమ్మి స్వవిషయాలను చెప్పకూడదు. అలాగే కొత్త వారిని నమ్మి ఇంటిని వారికి అప్పచెప్పకూడదు’ అని పెద్దలు చద్దిమూట లాంటి వాక్కులు పలికారు. అంతేకాదు జాతి వైరం ఉన్నవారితో స్నేహం చేయటం కూడా చేటు తీసుకువస్తుందని కూడా చెప్పారు. పక్షులకు, పిల్లులకు జాతి వైరం ఉంది. తన ఆహారం కోసం పిల్లి అబద్ధాలు చెప్పింది. ఆ మాటలను గద్ద నమ్మి, ప్రాణాలు పోగొట్టుకుంది. ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వారి స్వభావం తెలుసుకోవాలి. క్రూర స్వభావం ఉన్నవారితో సాధుజీవులు స్నేహం చేస్తే, వారి వల్ల ఎప్పటికైనా చేటు తప్పదని తెలిసిందే. అందుకే పెద్దలు చెప్పిన మాటలను మనకు ఇష్టం ఉన్నా లేకున్నా వినటం వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. అదే వారి మాటలను పెడచెవిన పెడితే ఎప్పటికైనా చేటు తప్పదని చెప్పటానికే ‘పెద్దల మాట చద్దన్నం మూట లేదా పెద్దల మాట పెన్నిధిమూట’ అని చెప్తారు.
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232