
- కాజీపేటలో నిర్మాణానికి రూ.160కోట్లు కేటాయించిన కేంద్రం
- రెండ్రోజుల కింద భూమి చదును, సాయిల్ టెస్ట్ పనులు ప్రారంభించిన ఆఫీసర్లు
- ప్రధాని శంకుస్థాపన అనంతరం స్టార్ట్ కానున్న పనులు
- దాదాపు ఐదారు వేల మందికి ఉపాధి అవకాశం
- తొవ్వకు అవసరమైన 1.17 ఎకరాల అప్పగింతపై దృష్టిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం
హనుమకొండ, కాజీపేట, వెలుగు: కాజీపేటకు రైల్వే ప్రాజెక్టు కల సాకారమవుతోంది. గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ వీల్ వర్క్ షాపు ప్రాజెక్టులు వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లగా.. 2016లో ప్రకటించిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీవోహెచ్) వర్క్‌షాప్‌కు ఇప్పుడిప్పుడే అగుడులు పడుతున్నాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఇప్పటికే టెండర్లు ఖరారు చేయగా.. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం మరోమారు ఫండ్స్ కేటాయించింది. దీంతో కాంట్రాక్టు సంస్థ పనులు స్టార్ట్ చేసింది. పీవోహెచ్ నెలకొల్పడానికి కేటాయించిన స్థలాన్ని చదును చేయించడంతో పాటు సాయిల్ టెస్టులు స్టార్ట్ చేశారు. కాగా ఈ నెలాఖరులో ప్రధాని మోడీ శంకుస్థాపన అనంతరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో స్టార్టయ్యే అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రాజెక్టు ఏర్పాటవుతున్న స్థలంలోకి వెళ్లేందుకు బాట కోసం 1.17 ఎకరాల స్థలం అవసరం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం, ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్‌లో రూ.160కోట్ల కేటాయింపు
కాజీపేటకు మేజర్ రైల్వే ప్రాజెక్టు కేటాయించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఇదివరకు మంజూరైన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు వెళ్లగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.383 కోట్ల అంచనాతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపును మంజూరు చేసింది. వర్క్ షాపు ఏర్పాటుకు 2016–17 బడ్జెట్‌లో రూ.188 కోట్లు శాంక్షన్ చేసింది. కానీ వర్క్ షాపు ఏర్పాటుకు మడికొండ-– అయోధ్యపురం మధ్యలోని సీతారామచంద్రస్వామి ఆలయ భూములను అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ఫండ్స్ వెనక్కి వెళ్లాయి. నాలుగు నెలల కింద ల్యాండ్ విషయం కొలిక్కిరావడంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) టెండర్లు పిలిచింది. మొత్తం రూ.383 కోట్లతో టెండర్లు పిలవగా.. హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ టైకిషా జాయింట్ వెంచర్ సంస్థ పనులు దక్కించుకుంది. విభజన హామీల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో సహకరించని కారణంగా ఆ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు పీవోహెచ్ ఏర్పాటుకు కేంద్రం రూ.160 కోట్లు కూడా కేటాయించింది. ఫండ్స్ సమస్య లేకపోవడంతో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ పనులు స్టార్ట్ చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ప్రధాని టూర్ క్యాన్సిల్ కావడంతో శంకుస్థాపన వాయిదా పడింది. కాగా ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రధాని శంకుస్థాపన చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
వ్యాగన్ల తయారీ కూడా ఇక్కడే..
పీవోహెచ్‌లో రైల్ కోచ్‌లకు ఆయిల్ ఛేంజింగ్, గ్రీజింగ్, వీల్స్ టర్నవుట్, ఇతర రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పీవోహెచ్ ఏర్పాటైతే సుమారు వెయ్యి మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు తర్వాత ఇక్కడే వ్యాగన్ల తయారీ కూడా చేపట్టనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అది కూడా ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో నాలుగైదు మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.
తొవ్వకు జాగ ఇస్తలేరు
వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఏర్పాటవుతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పీవోహెచ్‌కు వెళ్లే బాటకు అవసరమైన స్థలాన్ని అప్పగించడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఈ వర్క్ షాపు ఏర్పాటుకు 160 ఎకరాలు అవసరం కాగా.. మడికొండ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను పరిశీలించారు. 2021 ఏప్రిల్ జనవరి 6న 150.5 ఎకరాలు దేవాదాయ శాఖ నుంచి రైల్వేశాఖకు మ్యూటేషన్ చేసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రైల్వే ఆఫీసర్లకు అప్పగించారు. ఇంకో 10 ఎకరాలు కావాల్సి ఉండగా రైతుల నుంచి 9.03 ఎకరాలు సేకరించి ఇచ్చారు. కానీ ఆ స్థలానికి ప్రవేశ మార్గం వద్ద 1.17 ఎకరాల ప్రైవేటు ల్యాండ్ ఉంది. అది కూడా సేకరించి రైల్వేకు అప్పగిస్తేనే అడ్డంకులన్నీ తొలగుతాయి. ల్యాండ్ ఇచ్చేందుకు ఓనర్ సిద్ధంగా ఉన్నా ఇక్కడి ప్రభుత్వ పెద్దలు స్థలం ఇవ్వడంపై శ్రద్ధ పెట్టడం లేదు. ప్రాజెక్టుకు శిలాఫలకం పడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఇక్కడి నేతలు కావాలని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రాజకీయాల కోసం వేల మందికి ఉపాధినిచ్చే ప్రాజెక్టుకు అడ్డుతగలడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్ తొందరగా రైల్వే శాఖకు అప్పగించి, పనులు తొందరగా స్టార్ట్ అయ్యేలా చూడాలని వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.