గుక్కెడు నీళ్ల కోసం..కిలో మీటర్ల నడక..

గుక్కెడు నీళ్ల కోసం..కిలో మీటర్ల నడక..

పవిత్ర గోదావరి అక్కడే పుట్టింది..  కృష్ణమ్మ బిరా బిరా పరుగులు తీస్తుంటుంది. అయినా..మహరాష్ట్ర ప్రజలకు నీటి గోస తప్పడం లేదు. రెండు జీవనదులున్నా..గుక్కెడు నీళ్ల కోసం జనం అల్లాడుతున్నారు. ఇక వేసవి కాలం వస్తే చాలు మహరాష్ట్ర రూరల్ ఏరియా ప్రజల నీళ్ల కష్టాలు వర్ణణాతీతం. ముఖ్యంగా నాసిక్ జిల్లాలో ప్రజలు నీటి కోసం నానా పాట్లు పడుతున్నారు. బిందెడు నీటి కోసం కిలో మీటర్లు నడవాల్సిందే. ఉదయాన వెళ్తే..మళ్లీ ఏ సాయంత్రానికో ఇంటికి తిరిగోచ్చే పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణాలను పణంగా పెట్టి నీటి కోసం ఆడబిడ్డలు పాడు బడ్డ బావుల్లో దిగుతున్నారు. 

నాసిక్‌ జిల్లా త్రియంబక్ తాలుకాలోని పింపల్‌పాడలో ప్రజలు తాగునీటి కోసం దారుణమైన కష్టాలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలను తీర్చే ఏకైక బావి ఎండిపోవడంతో..దాహాన్ని తీర్చుకునేందుకు మహిళలు అడవి బాట పట్టారు. అడవి నుంచి బురద నీటిని తెచ్చుకుని వడబోసి తాగుతున్నారు. ఈ బురదనీటి కోసం కూడా వారు రోజూ 4 నుంచి 5 కిలో మీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. పింపల్‌పాడలో తాగునీరు సరఫరా చేయాల్సిందిగా అధికారులు, ప్రజాప్రతినిధుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..ఫలితం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా తమ నీటిగోసను తీర్చాలని వేడుకుంటున్నారు. తమ గ్రామానికి మంచినీరు, రోడ్డు సౌకర్యాన్ని కల్పించాని కోరుతున్నారు. 

ఇటు నాసిక్ జిల్లాలోని రోహిలే గ్రామంలోనూ అదే పరిస్థితి.  గ్రామంలో తీవ్రమైన నీటి సంక్షోభం వల్ల.. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళుతున్నారు. అది కూడా స్వచ్ఛమైన నీళ్ల కోసం కాదు బురదనీటి కోసం. ఊరికి దూరంగా ఉన్న బావిలో బురద నీటిని బట్టలో వడపోసి తీసుకొని వెళుతున్నారు. స్థానికంగా ఉన్న లోతైన బావే వారికి దిక్కు. ముందుగా ఓ వ్యక్తి దిగి.. తర్వాత బిందెలు, చిన్నపాటి ప్లాస్టిక్ డ్రమ్ములను నింపుతున్నారు. ఆ తర్వాత వాటిని పైకి లాగి..వేరే దానిలో వడపోసుకుంటున్నారు. ఆ నీటినే తాగుతున్నారు.  

నాసిక్ జిల్లాలోని హిరిద్ పాడ గ్రామంలో నీళ్ల గోస చెప్పరానిది. తాగునీరు కోసం కిలోమీటర్ల మేర దూరం నడవాల్సి దుస్థితి.  గ్రామంలో నల్లా కనెక్షన్ లేదు.  బోర్లు వేసినా, భూమిలో నుంచి నీళ్లు రావు. ఊరికి చాలా దూరంలో ఓ బావి ఉంది.  అందులో నీటినే తాగడానికి గ్రామ ప్రజలు ఉపయోగించుకుంటారు. దీంతో గంటల కొద్దీ నిలబడి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఊరి మంచినీటి కష్టాలు గ్రామంలోని యువకుల పాలిట శాపంగా మారాయి. తాగునీటి కొరత కారణంగా  ఇక్కడి యువకులకు పెళ్లిళ్లు అవడం లేదు. తమ అమ్మాయిని ఈ ఊరికి ఇస్తే, వారు కూడా నీళ్ల కోసం కష్టాలు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో.. హిరిద్ పాడ గ్రామ అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు.