మార్చి 2022 క్వార్టర్​తో పోలిస్తే ఆదాయం 4 శాతం తగ్గింది

మార్చి 2022 క్వార్టర్​తో పోలిస్తే ఆదాయం 4 శాతం తగ్గింది

571 కోట్ల నుంచి డబుల్‌

హైదరాబాద్​, వెలుగు: డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ లిమిటెడ్​ నికర లాభం జూన్​ 2022 క్వార్టర్లో 108 శాతం పెరిగి రూ. 1,188 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ. 571 కోట్లు. ఇక మార్చి 2022 క్వార్టర్​తో పోల్చినా నికర లాభం భారీగా పెరిగింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో  డాక్టర్​ రెడ్డీస్ ఆదాయం కూడా 6 శాతం గ్రోత్​తో రూ. 5,215 కోట్లయింది. అంతకు ముందు ఏడాది ఇది రూ. 4,919 కోట్లు. కాకపోతే మార్చి 2022 క్వార్టర్​తో పోలిస్తే ఆదాయం 4 శాతం తగ్గింది. తాజా క్వార్టర్లో ఇబిటా మార్జిన్​ 34.1 శాతానికి పెరిగినట్లు కంపెనీ తెలిపింది. 

పైప్​లైన్​లో కొత్త ప్రొడక్టులు 

కీలక బిజినెస్​లలో గ్రోత్​ కోసం నిరంతరం కష్టపడుతున్నామని, ప్రొడక్టివిటీ పెంచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని రిజల్ట్స్​ ఎనౌన్స్​మెంట్ సందర్భంగా కో ఛైర్మన్​ అండ్​ ఎండీ జీ వీ ప్రసాద్​ చెప్పారు.   కొత్త ప్రొడక్టులు  లాంచ్‌కు రెడీగా ఉన్నాయని కూడా  ఆయన పేర్కొన్నారు. 

గ్లోబల్​ జెనిరిక్స్​ 8 శాతం గ్రోత్​

గ్లోబల్​ జెనిరిక్స్​ సెగ్మెంట్​ రెవెన్యూ రూ. 4,430 కోట్లకు పెరిగింది. కొత్త ప్రొడక్టుల లాంఛ్ వల్లే ఈ రెవెన్యూలో 8 శాతం గ్రోత్​ సాధ్యమైనట్లు కంపెనీ తెలిపింది. నార్త్​ అమెరికా సేల్స్​ 2 శాతం పెరిగి రూ. 1,780 కోట్లకు చేరాయని, యూరప్​ అమ్మకాలు 4 శాతం గ్రోత్​తో రూ. 410 కోట్లయ్యాయని పేర్కొంది. దేశీయ మార్కెట్​ విక్రయాలు రూ. 1,330 కోట్లకు అంటే 26 శాతం ఎగిసినట్లు డాక్టర్​ రెడ్డీస్​ వివరించింది. ఎమర్జింగ్​ మార్కెట్స్​ రెవెన్యూ ఒక శాతం తగ్గి రూ. 900 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. రిజల్ట్స్​ నేపథ్యంలో డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ లిమిటెడ్​ షేరు గురువారం ఎన్​ఎస్​ఈలో రూ. 26 తగ్గి రూ. 4,260 వద్ద ముగిసింది. గత ఏడాది కాలానికి చూస్తే డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ షేరు విలువ 10 శాతం పతనమైంది. కిందటి నెల రోజులలోనే ఈ షేరు 3 శాతం పడింది.