
- ఎంసీహెచ్ లో 10 మందికి ఇద్దరే గైనకాలజిస్టులు
- ఇద్దరే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు
- రోజుకు పది నుంచి 15 డెలివరీలు
- డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి
- మెరుగైన వైద్యం అందక పేషెంట్లకు తిప్పలు
మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్హాస్పిటళ్లలో డెలివరీలు పెరగాలని, నార్మల్ డెలివరీలే చేయాలని డాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు సౌలత్లు కల్పించడంలో ఫెయిల్ అవుతోంది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల కోసం పెద్ద బిల్డింగులు కట్టినా సరిపడా డాక్టర్లు, స్టాఫ్ లేకపోవడంతో సర్కారు లక్ష్యం నీరుగారిపోతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో డాక్లర్లు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఫలితంగా మెరుగైన ట్రీట్మెంట్అందక గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. ఈ బాధలు పడలేక మరికొందరు ప్రైవేట్ దవాఖాన్లకు పోతున్నారు.
అరకొర సేవలు... తప్పని అవస్థలు
జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. చాలా చోట్ల గైనకాలిస్టులు లేరు. ఆపరేషన్ థియేటర్లు లేవు. దీంతో అతి కష్టంగా నార్మల్ డెలివరీలతో సరిపెడుతున్నారు. సర్జరీలు అవసరమైన కేసులను, సీరియస్ కేసులను ఎంసీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. దీంతో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఎంసీహెచ్ఒకటే పెద్ద దిక్కుగా మారింది. మహారాష్ర్టలోని సిరొంచ ప్రాంతం పేషెంట్లు కూడా రావడంతో రద్దీ పెరుగుతోంది. ఎంసీహెచ్‌లో రోజుకు 10 నుంచి 15 డెలివరీలు జరుగుతుండగా, ఇందులో సగం సీ సెక్షన్లు, ఔట్ పేషెంట్ (ఓపీ) కేసులు వందకు పైగా వస్తుండగా, ఇరవైకి పైగా ఇన్ పేషెంట్లు వస్తున్నారు. సీనియర్ రెసిడెంట్ల సహకారంతో ఒక్కో డాక్టర్ 24 గంటలు డ్యూటీ చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది నార్మల్డెలివరీ కోసం వేచి చూడకుండా సర్జరీలు చేయాలంటున్నారు. మరి కొందరు ముహూర్తాలు చూసుకొని వచ్చి సిజేరియన్లు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది సరైన వైద్యం అందడం లేదంటూ డాక్టర్లతో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు.
పేషెంట్లకు రవాణా కష్టాలు
ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఎంసీహెచ్‌ను ఊరవతల గోదావరి ఒడ్డుకు నిర్మించడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఎంసీహెచ్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రవాణా కష్టాలు తప్పడం లేదు. నిరుడు కొద్దిరోజులు ఆర్టీసీ బస్సును నడిపించి సరిపడా ఆదాయం రావడం లేదని బంద్ చేశారు. దీంతో ఎంసీహెచ్‌కు వెళ్లాలంటే ఆటోలే దిక్కయ్యాయి. బస్టాండ్ నుంచి ఒక్కొక్కరికి పగలు రూ.30, నైట్రూ.50 వసూలు చేస్తున్నారు. చుట్టుపక్కల హోటళ్లు, మెడికల్ షాపులు లేకపోవడంతో ఎమర్జెన్సీగా టౌన్‌కు రావాలన్నా కష్టమే. నైట్ఆటోలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ కాలేజీ దాటితే అంతా నిర్మానుష్య ప్రాంతం. రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు. ఎంసీహెచ్లోపల, బయట తగిన సెక్యూరిటీ లేకపోవడం వల్ల బిక్కుబిక్కమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏడాదైనా తీరు మారలే...
మంచిర్యాల గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన ఎంసీహెచ్‌ను నిరుడు మే నెలలో హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ఓపెన్ చేశారు. అంతకుముందు జిల్లా హాస్పిటల్లో కొనసాగుతున్న ఎంసీహెచ్‌ను కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. నేటికి ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పులేదు. గైనకాలజిస్టులు, ఇతర డాక్టర్లు కలుపుకొని 10 మందికి పైగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇద్దరు గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు. ఐదుగురు సీనియర్ రెసిడెంట్డాక్టర్లకు గాను నలుగురికి కేటాయించారు. వీరిలో ఇద్దరు లీవ్‌లో వెళ్లగా, ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయడం లేదు. కాంట్రాక్ట్ డాక్టర్ల రిక్రూట్మెంట్కోసం ఏడాది కాలంలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా స్పందన కరువైంది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్ట్ డాక్టర్లు ఎవరూ ఎంసీహెచ్‌లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. నర్సింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నప్పటికీ శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్విభాగాల్లో కొరత ఉంది.