నిధుల కొరత, అధికారుల అలసత్వంతో ఎక్కడి పనులు అక్కడే

నిధుల కొరత, అధికారుల అలసత్వంతో ఎక్కడి పనులు అక్కడే
  • జనాలకు తప్పని ఎదురుచూపులు 
  • నిధుల కొరతతో నిలిచిన పనులు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు

పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా మారుస్తామన్నారు. మెదక్​, సిద్దిపేట జిల్లాలోని ఆయా చోట్ల  ఐదేండ్ల కింద పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. నిధుల కొరత, అధికారుల అసత్వంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 

సిద్దిపేట/మెదక్/చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్ లలోని రెండు చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా మార్చాలనే ఉద్దేశంతో ఐదేండ్ల కింద పనులు ప్రారంభించినా నిధుల మంజూరులో జాప్యం కారణంగా అర్థంతరంగా నిలిచిపోయాయి.  చేసిన కొన్ని పనులు పాడవడంతోపాటు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చేర్యాల పెద్ద చెరువు ఎప్పుడూ నిండు కుండాలా ఉంటుంది. దీని ద్వారా చేర్యాల, మద్దూరు, దూలిమిట్ట మండలాల్లోని అనేక గ్రామాల్లో  భూగర్భ జలాలు పెరుగుతాయని, చెరువును మినీ టాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని  నిర్ణయించారు. 2017లో మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సుందరీకరణ పనులు ప్రారంభించారు. దాదాపు రూ. 3కోట్లతో చెరువు కట్ట రిపేర్లు, బోటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత రూ.1.50 కోట్ల తో కొంత పనులు చేసినా అవి అర్థాంతరంగా నిలిచిపోయాయి. మంజూరైన నిధులతో  కట్టపై మొరం పోయడం, పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు, మత్తడి పై నుంచి  బ్రిడ్జి  నిర్మాణం చేసి చేతులు దులుపుకున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ పనులు ఐదేండ్లు కావస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పెద్ద చెరువు సుందరీకరణ కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడంతోనే ఈ సమస్య వచ్చినట్లు పలువురు 
చర్చించుకుంటున్నారు. 

ఎల్లమ్మ చెరువుది ఇదే పరిస్థితి.. 

హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు ఐదేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. నిర్మాణం కోసం దాదాపు రూ.6 కోట్లతో  కట్ట రిపేరు, పూడిక తీత, పిచ్చి మొక్కలను తొలగించి చేతులు దులుపుకున్నారు. కట్టపై లైటింగ్, రోడ్డు, వాకింక్ ట్రాక్, ఫుట్ పాత్, తదితర పనులు నిధులు లేక నిలిచిపోయాయి. చెరువు కట్ట పైకి వెళ్లే రోడ్డుతోపాటు కట్టపై పలు చోట్ల వరద నీటితో కోసుకుపోయి ప్రమాదకరంగా మారాయి. ఇప్పుడు ఈ రెండు చెరువులకు అదనంగా నిధులు మంజూరైతే తప్ప పనులు ప్రారంభమయయ్యే పరిస్థితి లేదు.

మెదక్​లో ఎన్నో చెప్పిన్రు.. ఏమీ చేయట్లే.. 

మెదక్ పట్టణంలో ప్రజలు సేద తీరేందుకు పార్క్​ గానీ, ఆహ్లాదకరమైన ప్రదేశం గానీ లేదు. ఈ నేపథ్యంలో పట్టణ శివారులోని పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ ​ఇంజనీర్లు ఎస్టిమేషన్​లు తయారు చేసి ప్రతిపాదనలు పంపగా ఐదేండ్ల కింద ప్రభుత్వం రూ.9.52 కోట్లు మంజూరు చేసింది. రెండు చెరువు కట్టలను వెడల్పుచేసి, వ్యూ పాయింట్ లు, సందర్శకులు కూర్చునేందుకు కుర్చీలు, పిల్లల కోసం ఆట పరికరాలు ఏర్పాటు చేస్తామని, గ్రీనరీ డెవలప్ చేస్తామని, బోటింగ్​ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. రెండెకరాల విస్తీర్ణంలో పార్క్​ కూడా ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. మినీ ట్యాంక్​ బండ్ మీద గతంలో మెదక్​ జిల్లా కేంద్ర సాధన కోసం పోరాటం చేసిన రాందాస్, పేదల భూ సమస్యల పరిష్కారానికి ఉద్యమించిన కేవల్​ కిషన్, తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్నవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ ఐదేండ్లు గడచినా పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. కేవలం కట్ట వెడల్పు, గైడ్ వాల్ నిర్మాణం పనులు మాత్రమే పూర్తయ్యాయి. బోటింగ్ తెచ్చినప్పటికీ పనులు పూర్తికాక అది వృథాగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మినీ ట్యాంక్​ బండ్​ల పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 
అనివార్య కారణాలతో నిలిచిపోయాయి. 

చేర్యాల పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు అనివార్య కారణాలతో నిలిచిపోయాయి.  మినీ ట్యాండ్ బండ్ సుందరీకరణ కోసం ఇప్పటి వరకు  రూ.1.50 కోట్లు ఖర్చు చేశాం. త్వరలోనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయిస్తాం.

- శ్యామ్, డీఈఈ ఇరిగేషన్, చేర్యాల